టెన్షన్, టెన్షన్.. మున్నేరు దగ్గర ఇంకా జలదిగ్బంధంలోనే ఆ 9 మంది..

కనీసం సహాయక చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. అధికారులు, ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు.

టెన్షన్, టెన్షన్.. మున్నేరు దగ్గర ఇంకా జలదిగ్బంధంలోనే ఆ 9 మంది..

Munneru River Floods : ఖమ్మం జిల్లా మున్నేరు దగ్గర చిక్కుకున్న 9మంది ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నారు. వారిని రేపే(సెప్టెంబర్ 2) కాపాడే అవకాశం ఉంది. మంత్రులు పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావు మున్నేరు ఉధృతిని పరిశీలించారు. అయితే, తక్షణమే బాధితులను కాపాడకపోతే ప్రాణాలు పోతాయని వారి బంధువులు కన్నీటిపర్యంతం అవుతున్నారు. డ్రోన్ల ద్వారా వారికి భోజనాలు పంపుతున్నారు. డ్రోన్లను కూడా బాధితుల కుటుంబసభ్యులే ఏర్పాటు చేసుకున్నారు. అధికారులు కనీసం సహాయక చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. అధికారులు, ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు.

ఆ 9 మందిని కాపాడే బాధ్యత నాది, ప్రభుత్వానిది- మంత్రి తుమ్మల
”బ్రిడ్జిపై చిక్కుకున్న 9 మంది బాధితులకు, వారికి కుటుంబసభ్యులకు ఒకటే విన్నపం. ఇది అనుకోని ఉపద్రవం. ఎప్పుడూ కనీవిని ఎరుగని రీతిలో వర్షం. అన్ని నదులూ మున్నేరులో కలవడం, ఎవరూ ఊహించని రీతిలో పెద్దఎత్తున నదీ పరివాహక ప్రాంతానికి అటు ఇటు ఉన్న వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వారందరిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బ్రిడ్జి మీదకు వెళ్లిన తర్వాత అనుకోకుండా వరద ఉధృతి పెరిగిపోవడంతో వారు అటు పక్కకు కానీ, ఇటు పక్కకు కానీ వెళ్లలేకపోయారు. హెలికాప్టర్ ద్వారా వారిని కాపాడాలనే ప్రయత్నం చేశారు.

అయితే, ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వాతావరణం అనుకూలించలేదు. అది కూడా ఆర్మీ హెలికాప్టర్ అయితే తప్ప లిఫ్ట్ చేయలేము అని చెప్పారు. విశాఖపట్నం నేవీ అధికారులు, ఏపీ ప్రభుత్వంతో మాట్లాడాము. వారు విజయవాడకు ఆర్మీ హెలికాప్టర్ ను రప్పించారు. ఆ హెలికాప్టర్ ఖమ్మం వచ్చే లోపు లైట్ ఫెయిల్ అయ్యింది. చీకట్లో హెలికాప్టర్ ను ఆపరేట్ చేయలేము అని పైలెట్ చెప్పారు. కాబట్టి ఏ రకంగానైనా ఆ 9మందిని కాపాడేందుకు గజ ఈతగాళ్లను, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తీసుకొస్తున్నాం. రోడ్లన్నీ తెగిపోవడంతో వారు కూడా ఆలస్యంగా స్పాట్ కు చేరుకుంటున్నారు.

Also Read : విజయవాడ-హైదరాబాద్ మధ్య రాకపోకలు బంద్

వాళ్ల ద్వారా వారిని తీసుకొచ్చి వారి కుటుంబసభ్యులకు అప్పగించే వరకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కలెక్టర్, కమిషనర్, యంత్రాంగం మొత్తం అదే ప్రయత్నంలో ఉన్నారు. రెండు మూడు గంటల్లో ఆపరేషన్ స్టార్ట్ చేస్తామన్నారు. తప్పకుండా వారిని ఈ రాత్రికే తీసుకొచ్చి వారి కుటుంబసభ్యులకు అప్పజెప్పే బాధ్యత మా ప్రభుత్వానిది” అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తేల్చి చెప్పారు.