ఉస్మానియా జనరల్ ఆసుపత్రి దుస్థితి, ఈ పాపం ఎవరిది ? తెలుసుకోవాల్సిన విషయాలు

Osmania Hospital Op Filled With Flood Water Who Is The Reason For This
చారిత్రక ఉస్మానియా జనరల్ ఆస్పత్రిని మళ్లీ మురుగునీరు ముంచెత్తింది. బుధవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి పాత భవనంలోని సూపరింటెండెంట్ చాంబర్ సహా… కారిడార్, మేల్ వార్డులు ఉస్మాన్‌సాగర్‌ను తలపించాయి. ఆస్పత్రిలోకి వరద నీరు ముంచెత్తడంతో వార్డుల్లో చికిత్స పొందుతున్న ఇన్‌పేషంట్లు మాత్రమేకాదు.. వారికి చికిత్సలు అందిస్తున్న వైద్య సిబ్బంది సైతం బెంబేలెత్తిపోయారు.
2015 జులైలో : –
ఈ దుస్థికి కారణమేంటో ఒకసారి ఆలోచిస్తే… 2015 జూలైలో ముఖ్యమంత్రి కేసీఆర్.. ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించారు. దాదాపు 110 సంవత్సరాల క్రితం నిర్మించిన ఆస్పత్రి పూర్తిగా శిథిలమై.. సాధారణ నిర్వహణకు సైతం ఉపయుక్తంగా లేని పరిస్థితిని గమనించారు. హాస్పిటల్‌లోని 11 బ్లాకుల్లో 8 బ్లాకులు ఎందుకూ పనికిరాకుండా పోయాయి. మరమ్మతులు కూడా చేయలేని దుస్థితిలో ఉన్న ఆస్పత్రిని కూల్చివేయాలని భావించారు. ఆ స్థానంలో 24 అంతస్థుల చొప్పున అద్భుతమైన రెండు భారీ టవర్ల నిర్మాణంతో అత్యాధునిక హంగులతో సరికొత్త ఆస్పత్రిని నిర్మిస్తామని ప్రకటించారు.
విపక్షాల రాద్ధాంతం : –
సీఎం ప్రకటించడమే ఆలస్యం.. విపక్షాలకు ఓ అంశం దొరికింది. ఒకరివెంట ఒకరు ఉస్మానియాపై వాలిపోయారు. చారిత్రక నేపథ్యాన్ని వంకగా చూపుతూ భవనాన్ని కూల్చొద్దని ఆందోళనలు మొదలుపెట్టారు. కోర్టుల్లో కేసులు.. అసెంబ్లీ సాక్షిగా ఆందోళనలు.. ప్రభుత్వ సంకల్పాన్ని అడ్డుకోవడానికి చెయ్యాల్సినన్ని పనులు చేశారు. పలు సంస్థలూ, ప్రజాసంఘాలు.. హక్కుల నాయకులు.. ఉస్మానియా ఆస్పత్రికి బారులు కట్టారు. 1168 బెడ్‌లు ఉన్న అంత పెద్ద ఆస్పత్రి భవనం దురదృష్టవశాత్తూ కూలిపోతే పరిస్థితి ఏమిటన్నది ఎవరూ ఆలోచించలేదు.
ప్రభుత్వ లక్ష్యానికి ప్రతిపక్షాల గండి : –
మరమ్మతు చేసినా బాగుపడేస్థితిలో లేని హాస్పిటల్ స్థానంలో ఆధునిక హంగులతో అద్భుత ఆస్పత్రి నిర్మించి.. రోగులకు మెరుగైన వైద్యం అందించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ప్రతిపక్షాలు గండికొట్టాయి. ఉస్మానియాలోకి ఇప్పుడు పెద్ద ఎత్తున వర్షపు నీళ్లు వచ్చాయంటే… దానికి కారణం ఎవరు?
ప్రస్తుతం రోగులు నానా ఇక్కట్లు పడుతున్నారంటే అందుకు బాధ్యత ఎవరిది? ఐదేళ్ల క్రితం కొత్త భవన నిర్మాణం ప్రారంభించి ఉంటే.. ఈపాటికి పూర్తయి ఉండేది. విపక్షాల ఆందోళనకారణంగా కొత్త భవనం నిర్మించాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకుంది. దీంతో ఇప్పుడు ఇలాంటి ఇబ్బందులను రోగులు ఎదుర్కోవాల్సి వస్తోంది.