Hanumantha Rao : ఏపీ స్పెషల్ స్టేటస్ ఏమైందని మోదీని పవన్ కళ్యాణ్ అడగాలి : వీహెచ్
అప్పుడు అయోధ్య రామ మందిరం పేరు చెప్పి ఓట్లు అడిగారు.. ఇప్పుడు బీసీ ఓట్ల పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారు అని పేర్కొన్నారు.

Congress Leader Hanumantha Rao
Hanumantha Rao – Pawan Kalyan : ఏపీ స్పెషల్ స్టేటస్ ఏమైందని ప్రధాని మోదీని పవన్ కళ్యాణ్ అడగాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు పేర్కొన్నారు. మోదీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నాడు, ప్రతి ఒక్కరి అకౌంట్ లో రూ.15 లక్షలు వేస్తామని వేశారా అని నిలదీశారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్ లోని గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను అదాని, అంబానీకి అప్పగిస్తే పవన్ కళ్యాణ్ ఏం చేశారని ప్రశ్నించారు.
‘పవన్ కళ్యాణ్.. నీకు మంచి ఫాన్స్ ఫాలోయింగ్ ఉంది.. దాని కోసమే మోదీ మిమ్మల్ని పక్కన కుర్చోబెట్టుకున్నారు’ అని తెలిపారు. మోదీ ఎవరికి లాభం చేశారో పవన్ కళ్యాణ్ చెప్పాలని డిమాండ్ చేశారు. బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేసింది కాంగ్రెస్ మాత్రమేనని స్పష్టం చేశారు. కానీ, మోదీ మూడోసారి ప్రధానమంత్రి అవుతారని పవన్ కళ్యాణ్ ఎలా చెబుతారని ప్రశ్నించారు. ‘మీరు బీసీ సీఎం అంటే ఎవరు నమ్ముతారు’ అని అన్నారు.
కుల సంఘాలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎన్నికలు వచ్చాయని జై ఓబీసీ అంటున్నారని విమర్శించారు. అప్పుడు అయోధ్య రామ మందిరం పేరు చెప్పి ఓట్లు అడిగారు.. ఇప్పుడు బీసీ ఓట్ల పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారు అని పేర్కొన్నారు. కుల గణన చేయాలని, క్రిమిలేయర్ ఎత్తి వేయాలని కోరానని, బీసీ మంత్రి ఏర్పాటు చేయాలని చెప్పానని కానీ, ఏ ఒక్కటి చేయలేదని విమర్శించారు. స్పెషల్ స్టేటస్ ఏమైందని మోదీని పవన్ కళ్యాణ్ అడగాలన్నారు.
అదానీకి ఇచ్చిన స్టీల్ ప్లాంట్ ను తిరిగి ఇవ్వాలని మోదీని పవన్ కళ్యాణ్ అడగాలని సూచించారు. పవన్ కళ్యాణ్ మంచోడే.. కానీ అప్పుడప్పుడు తొందరపాటు నిర్ణయం తీసుకుంటారని అది మంచిది కాదన్నారు. పవన్ కళ్యాణ్ అంటే తనకు అభిమానమని అన్నారు. బండి సంజయ్ ఏం పాపం చేశారని ప్రశ్నించారు. రాత్రి, పగలు అనక రాష్ట్రం మొత్తం తిరిగిన బండి సంజయ్ కు అన్యాయం చేశారని తెలిపారు. బీసీ బిడ్డను పక్కన పెట్టారని పేర్కొన్నారు.