Hyderabad : ఇదెక్కడి విచిత్రం రా మావా.. ఏకంగా పోలీస్ స్టేషన్‌లోనే దొంగతనం.. రూ.1.75లక్షల విలువైన వస్తువు చోరీ..
Hyderabad : లాకర్‌లో భద్రపర్చిన ఫోన్ చోరీకి గురికావడంతో ఉన్నతాధికారులు షాక్ కు గురయ్యారు. దీంతో విచారణ చేపట్టగా..
Hyderabad : సాధారణంగా ప్రజలు తమ వస్తువులు చోరీకి గురైతే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తారు. పోలీసులు కేసు నమోదు చేసి.. వాటిని రికవరీ చేసేందుకు చర్యలు తీసుకుంటారు. కానీ, హైదరాబాద్ పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్లోనే చోరీ జరిగింది. ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
మెహదీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని రైతు బజార్ వద్ద తన ఫోన్ పోయిందని ఒక వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి దొంగను గుర్తించారు. అతని వద్ద నుంచి రూ.1.75లక్షల విలువైన సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకొని.. పోలీస్ స్టేషన్ లోని లాకర్‌లో భద్రపరిచారు. అయితే, లాకర్‌లో భద్రపర్చిన ఫోన్ చోరీకి గురికావడం చర్చనీయాంశంగా మారింది.
లాకర్‌లో భద్రపర్చిన ఫోన్ చోరీకి గురికావడంతో ఉన్నతాధికారులు షాక్‌కు గురయ్యారు. దీంతో విచారణ చేపట్టగా.. పోలీస్ డ్రైవర్ శ్రవణ్ కుమార్ ఫోన్ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు.
శ్రవణ్ కుమార్ ఖరీదైన ఫోన్ పై కన్నేసి చాకచక్యంగా దాన్ని చోరీ చేసినట్లు విచారణలో తేలింది. ఫోన్ చోరీ వెనుక అతని హస్తం ఉందని గుర్తించిన ఉన్నతాధికారులు.. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు జరిపారు. శ్రవణ్ కుమార్ దొంగతనం చేసినట్లు రుజువు కావడంతో అతన్ని తక్షణమే రిమాండుకు తరలించారు. ఏకంగా చట్టాన్ని పరిరక్షించే కేంద్రంలోనే దొంగతనం జరగడం, పోలీస్ సిబ్బందే దొంగతనానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై మరింత లోతైన విచారణ జరిగే అవకాశం ఉంది.
