High Security : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. లక్షమంది పోలీసు సిబ్బందితో భారీ భద్రత

కేంద్ర భద్రతా బలగాలు తెలంగాణకు చేరుకున్నాయి. సమస్యాత్మక ప్రాంతాలతోపాటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. 375 కంపెనీల కేంద్ర బలగాలు తెలంగాణ ఎన్నికల విధుల్లో ఉన్నాయి.

High Security : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. లక్షమంది పోలీసు సిబ్బందితో భారీ భద్రత

High Security (1)

Updated On : November 29, 2023 / 9:37 AM IST

High Security Election Polling : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రేపు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. సమస్యాత్మక 13 నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి 4 వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.

భారీగా పోలీసు భద్రత
అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోలింగ్ కు భారీగా పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. పోలీసుల నిఘా నీడలో ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. లక్షమంది పోలీసు సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉన్నారు. రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి.

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అదనపు బలగాలు

కేంద్ర భద్రతా బలగాలు తెలంగాణకు చేరుకున్నాయి. సమస్యాత్మక ప్రాంతాలతోపాటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. 375 కంపెనీల కేంద్ర బలగాలు తెలంగాణ ఎన్నికల విధుల్లో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 19 వేల 3 వందల 75 ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

భద్రతా సిబ్బంది ఆధీనంలోకి పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్ లు

4 వేల 400 సమస్యాత్మక ప్రాంతాలకు అదనంగా సిబ్బందిని కేటాయించారు. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ ఇండిస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్, ఇండో టెబిటన్ బార్డర్ పోలీస్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ భద్రతా విధుల్లో ఉండగా పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్ లను భద్రతా సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకోనున్నారు.

మావోయిస్టు పార్టీ ఎన్నికల బహిష్కరణకు పిలుపు
65 వేల మంది తెలంగాణ పోలీసులు, 18 వేల మంది హోంగార్డులు ఎన్నికల విధుల్లో ఉన్నారు. ఇప్పటికే మావోయిస్టు పార్టీ ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చింది. దీంతో ఏజెన్సీ ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. డిసెంబర్ 3న ఓట్ల కౌంటింగ్ జరుగనుంది.