డీకే అరుణ లగచర్ల పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత.. సీఎం రేవంత్‌పై విమర్శలు
లగచర్లకు రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి వెళ్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ రాదా..? ముఖ్యమంత్రి అన్నను పంపిస్తారు.. ఎంపీగా నేను వెళ్లకూడదా?

MP DK Aruna
DK Aruna: బీజేపీ ఎంపీ డీకే అరుణ కొడంగల్ నియోజకవర్గం లగచర్ల పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. లగచర్ల వెళ్తున్న ఆమె వాహనాలను పోలీసులు మన్నెగూడ వద్ద అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై ఎంపీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అరుణను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ బీజేపీ నేతలు రోడ్డుపై బైఠాయించడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.
ఈసందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ.. పోలీసుల తీరుపై మండిపడ్డారు. నేను ఎంపీగా నా నియోజకవర్గంలో ప్రజలను పరామర్శించొద్దా అంటూ ప్రశ్నించారు. నేను ఎంపీని.. ఏం తప్పు చేశానని అడ్డుకున్నారు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వల్లే జిల్లాలో లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చింది. నేను కలెక్టర్ ను కలిసేందుకు వెళ్తున్నాను.. నాకు అపాయింట్ మెంట్ ఉంది. అయినా, నా నియోజకవర్గంలో నేను ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉందని అరుణ అన్నారు.
Also Read: కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్
సీఎం రేవంత్ రెడ్డి వల్లనే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది. ముందు రేవంత్ రెడ్డిని అరెస్టు చేయండి. లగచర్లకు రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి వెళ్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ రాదా..? ముఖ్యమంత్రి అన్నను పంపిస్తారు.. ఎంపీగా నేను వెళ్లకూడదా? ఇడెక్కడి దౌర్జన్యం. రాష్ట్రంలో ఎంపీగా నా నియోజకవర్గంలో నేను పర్యటించొద్దా..? అంటూ పోలీసుల తీరుపై డీకే అరుణ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. డీకే అరుణను స్టేషన్ కు తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా.. నేను స్టేషన్ లోకి ఎందుకు వస్తాను.. నేను ఏం తప్పు చేశానని నన్ను స్టేషన్ కు తీసుకెళ్తారు అంటూ పోలీసుల తీరుపై డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు.