Lookback Politics 2024 : రాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన తెలంగాణ తల్లి విగ్రహ వివాదం..

ఈ 2024 సంవత్సరంలో తెలంగాణ రాజకీయాల్లో అనేక కీలక ఘట్టాలు చోటు చేసుకున్నాయి.

Lookback Politics 2024 : రాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన తెలంగాణ తల్లి విగ్రహ వివాదం..

Updated On : December 19, 2024 / 4:01 PM IST

Lookback Politics 2024 : మరికొన్ని రోజుల్లో కొత్త ఏడాది రాబోతోంది. 2024కు గుడ్ బై చెప్పబోతున్నాం. న్యూఇయర్ 2025కు వెల్ కమ్ చెప్పబోతున్నాం. ఈ 2024 సంవత్సరంలో తెలంగాణ రాజకీయాల్లో అనేక కీలక ఘట్టాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన అంశాలు ఎన్నో. అందులో ప్రధానమైనది తెలంగాణ తల్లి విగ్రహ వివాదం.

రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణ తల్లి విగ్రహం రూపంలో మార్పులు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. కాంగ్రెస్, బీఆఎస్ మధ్య చిచ్చు రాజేసింది. ఇటీవలే తెలంగాణ సచివాలయ ప్రాంగణంలో సరికొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాగా, విగ్రహంలో మార్పులు చేయడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా తప్పు పట్టింది. తాము అధికారంలోకి వచ్చాక పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని తిరిగి ఆవిష్కరిస్తామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.

ఈ నెల 9న రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. గత ప్రభుత్వంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూర్తి భిన్నంగా కొత్త రూపంతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు. గతంలో తెలంగాణ తల్లి విగ్రహానికి కిరీటం, బంగారు హారాలు, నెక్లెస్, చెవికి కమ్మలతో ఉండగా.. కొత్త విగ్రహ రూపంలో తెలంగాణ తల్లి చేతిలో మొక్కజొన్న, వరి, సజ్జ కంకులు ఉన్నాయి. మరో చేత్తో అభయ హస్తంతో ఉన్నట్లు ప్రభుత్వం ఫోటోను విడుదల చేసింది.

కొత్త విగ్రహ రూపం- పాత విగ్రహ రూపంలో మార్పులు ఇవే..
* తలకు కిరీటం లేదు – తలకు కిరీటం
* సాధారణ గృహిణి రూపం – దేవతా రూపం
* సాధారణ ముక్కుపుడక – ముక్కుపుడకలో రత్నం
* ఆకుపచ్చ చీర – ఎర్ర చీర
* ఎడమ చేతిలో మొక్కజొన్న, వరి, సజ్జ కంకులు – ఎడమ చేతిలో బతుకమ్మ
* కుడి చేతితో అభయహస్తం – కుడి చేతిలో మొక్కజొన్న, సజ్జ కంకులు
* కొత్త విగ్రహంలో మెడలో మాత్రమే నగలు – నడుము వద్ద వడ్డాణం, మెడలో నగలు
* చేతికి మట్టి గాజులు – చేతికి బంగారు గాజులు

మన సంస్కృతి, సంప్రదాయాలకు తగ్గట్లుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించున్నామని సీఎం రేవంత్ తెలిపారు. సమ్మక్క, సారలమ్మ, చాకలి ఐలమ్మ స్ఫూర్తితో విగ్రహాన్ని రూపొందించామన్నారు. విగ్రహం కింద పీఠంలో నీలి రంగు గోదావరి, కృష్ణమ్మలకు గుర్తు అని వివరించారు. కుడి చేతితో జాతికి అభయాన్ని ఇస్తూ.. ఎడమ చేతితో మొక్కజొన్న, వరి పంటలు ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

తెలంగాణ తల్లి విగ్రహంలో కాంగ్రెస్ ప్రభుత్వం మార్పులు చేయడాన్ని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా తప్పుపట్టారు. సీఎం రేవంత్ పై నిప్పులు చెరిగారు. ప్రభుత్వం అభివృద్ధిలో పోటీ పడాలి.. అంతేకానీ ఇలా విగ్రహాలు మార్చడంలో కాదని బీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. కాంగ్రెస్ చెప్పిన మార్పు ఇదేనా అని విమర్శించారు. 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన బతుకమ్మను తీసేసి కేవలం చేయి గుర్తు కోసమే సీఎం రేవంత్ రెడ్డి ఇలా చేశారని ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన బతుకమ్మ ఆనవాళ్లు లేకుండా చేశారని బీఆర్ఎస్ నేతు ఆరోపణలు గుప్పించారు. అనేక చర్చల తర్వాతే కేసీఆర్‌ పాలనలో తెలంగాణ తల్లి విగ్రహం ఆమోదం పొందిందన్నారు.

తెలంగాణ తల్లి దైవ స్వరూపిణిగా, శక్తి స్వరూపిణిగా తీర్చిదిద్దామన్నారు. తెలంగాణ అస్తిత్వమైన బతుకమ్మ, కిరీటం తీసేసి విగ్రహాన్ని మార్చడం దారుణం అన్నారు. సీఎం రేవంత్ ప్రతిష్టించిన విగ్రహం.. తెలంగాణ తల్లి కాదని, కాంగ్రెస్ తల్లి అని బీఆర్ఎస్ ముఖ్య నాయకులు అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన మొదటి రోజే కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని గాంధీభవన్ కు పంపిస్తామన్నారు.

Also Read : ఈ ఏడాది ఎన్నికలు జరిగిన రాష్ట్రాలు ఇవే.. ఏయే రాష్ట్రాల్లో ఏయే పార్టీలు గెలిచాయో తెలుసా?