Rain Alert : రెయిన్ అలర్ట్.. తెలంగాణలోని 11 జిల్లాల్లో నేడు అతిభారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ

Rain Alert in Telangana : ఆది, సోమవారాల్లో తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

Rain Alert : రెయిన్ అలర్ట్.. తెలంగాణలోని 11 జిల్లాల్లో నేడు అతిభారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ

Rain Alert in Telangana

Updated On : September 28, 2025 / 9:08 AM IST

Rain Alert in Telangana: తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. మరో రెండు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ (Rain Alert in Telangana) హెచ్చరికలు జారీ చేసింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో రెండ్రోజులు వర్షాలు దంచికొట్టనున్నాయి. ఒడిశాలోని గోపాల్‌పుర్ వద్ద శనివారం ఉదయం వాయుగుండం తీరం దాటింది. అయితే, నేడు దక్షిణ ఒడిశా – ఛత్తీస్‌గడ్ ప్రాంతంలో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాయుగుండం కేంద్రం నుంచి తెలంగాణ మీదుగా మహారాష్ట్ర, గోవా వరకు 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆది, సోమవారాల్లో తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.

Also Read: Musi Floods : వామ్మో.. మూసీ ఉగ్రరూపం చూశారా.. మీరెప్పుడూ ఇలా చూసిఉండరు.. వీడియో వైరల్..

ఇవాళ (ఆదివారం) రాష్ట్రంలోని 11 జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్న వాతావరణ శాఖ.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

శనివారం పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా మెదక్ జిల్లా పాపన్నపేట మండలం లింగపల్లి గ్రామంలో 10.5 సెం.మీ వర్షపాతం నమోదుకాగా.. సంగారెడ్డిజిల్లా మనూర్ లో 9.2 సెం.మీ, వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం మేడిపల్లిలో 9.1 సెం.మీ, మెదక్ జిల్లా రేగోడెలో 6.4 సెం.మీ, ఆసిఫాబాద్ లో 6.1 సెం.మీ వర్షపాతం నమోదైంది.