Rythu Bharosa: మీకు రైతుభరోసా డబ్బులు ఇంకా పడలేదా.. ఇదే కారణం.!
తెలంగాణ ప్రభుత్వం గడిచిన నెల రోజుల్లో మూడు విడుతల్లో మూడెకరాల వరకు రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతు భరోసా నిధులను..

Raithu bharosa
Rythu Bharosa: తెలంగాణ ప్రభుత్వం ఎకరానికి ఏడాదికి రూ.12వేల చొప్పున రెండు విడుతల్లో రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మూడు విడుతల్లో మూడెకరాల వరకు రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతు భరోసా నిధులను ప్రభుత్వం జమ చేసింది. తొలి విడతలో ఎకరా వరకు ఉన్న 17.03 లక్షల మంది రైతులకు చెందిన 9.29 లక్షల సాగు భూమికి రూ.557.54 కోట్లను జమ చేయగా.. రెండో విడతలో 13.23 లక్షల మంది రైతులకు 18.19 లక్షల ఎకరాలకు 1,091.95 కోట్ల రూపాయలను ప్రభుత్వం జమ చేసింది. మూడో విడతలో 21.12 లక్షల ఎకరాలకుగాను రూ.1,269.32 కోట్లను 10.13 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది.
ఇప్పటి వరకు మొత్తంగా మూడెకరాల లోపు రైతులకు రూ.3వేల కోట్ల సొమ్మును రేవంత్ సర్కార్ రైతుల ఖాతాల్లో జమ చేసింది. అయితే, మూడెకరాల లోపు భూమి కలిగిఉన్న కొంతమంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ కాలేదు. దీంతో రైతు భరోసా డబ్బులు పడని రైతులు ఆందోళన చెందుతున్నారు.
తెలంగాణ సర్కార్ రాళ్లు, రప్పలు, గుట్టలు, వెంచర్లు, సాగుకు పనికిరాని ఇతర భూములకు రైతు భరోసా సాయాన్ని ఇవ్వకూడదని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా క్షేత్ర స్థాయిలో సర్వే చేసిన అధికారులు సాగుయోగ్యం కాని భూములను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఈ క్రమంలో సాగుయోగ్యమైన భూములుసైతం బ్లాక్ లిస్టులోకి వెళ్లినట్లు తెలిసింది.
ఉదాహరణకు.. ఒక సర్వే నెంబర్ లో పదిహేను ఎకరాల భూమి ఉంటే.. అందులో ఐదెకరాలు మాత్రమే సాగుకుయోగ్యం కాని భూమి ఉంది. అయితే, ఆ సర్వే నెంబర్ లో మిగిలిన 10 ఎకరాలు కూడా బ్లాక్ లిస్టులోకి వెళ్లడం వల్ల ఆయా రైతులకు పెట్టుబడి సాయం జమకాలేదని తెలుస్తోంది. దీంతో ఈ సమస్యను పరిష్కరించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. రెవెన్యూశాఖ సహాయంతో ఈ సమస్యను పరిష్కరించి.. అర్హులైన రైతుల ఖాతాల్లో డబ్బును జమ చేయనున్నారు. త్వరలోనే ఆ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంది.
మరోవైపు మూడెకరాలు పైబడిన రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు ఎప్పుడు పడుతాయన్న అంశంపైనా సస్పెన్షన్ కొనసాగుతుంది. వ్యవసాయ శాఖ ఎప్పటికప్పుడు రైతుల జాబితాను ఆన్ లైన్ లో ఆర్థిక శాఖకు అప్ డేట్ చేయాలి. అందుకు అనుగుణంగా ఆర్బీఐకి, అటు నుంచి రైతుల ఖాతాలకు పెట్టుబడి సాయం జమ అవుతుంది. అయితే, రైతుల వివరాలను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసి బిల్లులు రిలీజ్ కోసం ఆర్థిక శాఖకు పంపినట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.
కానీ, ఇప్పటికీ మూడు విడతల్లో మూడు ఎకరాల వరకు రూ.3వేల కోట్ల దాకా జమ చేసిన ఆర్థిక శాఖ మిగిలిన రైతు భరోసాను పక్కనపెట్టింది. కొన్ని టెక్నికల్ సమస్యలు రావడం వల్లే ఈ ప్రాసెస్ ఆగిపోయినట్లు ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ అధికారులు చెబుతున్నారు. అయితే, త్వరలోనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. మార్చి నెలలో మూడెకరాలు పైబడిన రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ అవుతాయని అధికారులు చెబుతున్నారు.