Telangana Caste Census : కులగణన సర్వే.. రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు సభలో చట్టబద్ధత కల్పిస్తామని తెలిపారు.

Telangana Caste Census Survey : తెలంగాణలో మరోసారి కులగణన సర్వేకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. సర్వేలో పాల్గొనని వారి కోసం మరోసారి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 16 నుంచి 28 వరకు తమ వివరాలు నమోదు చేసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు.
సర్వేలో 3.1 శాతం మంది పాల్గొనలేదని, వారంతా కొత్త సర్వేలో వివరాలు ఇచ్చి రాష్ట్ర జనాభా లెక్కల్లో పేరు వచ్చేలా చూసుకోవాలని భట్టి విక్రమార్క చెప్పారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు సభలో చట్టబద్ధత కల్పిస్తామని తెలిపారు. బీసీ రిజర్వేషన్ బిల్లుకు జాతీయ స్థాయిలో మద్దతు కోరతామని వెల్లడించారు.
Also Read : రేషన్ కార్డులు కావాలా? మీసేవలో ఇలా అప్లై చేసుకోండి.. వెళ్లేటప్పుడు ఈ ప్రూఫ్స్ తీసుకెళ్లండి..
”సర్వేలో పాల్గొనకుండా మిగిలిపోయిన 3.1శాతం మంది.. మా వివరాలు ఇస్తామని ముందుకొస్తున్నారు. వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం మరోసారి వివరాలు నమోదు చేసుకోవడానికి ఫిబ్రవరి 16వ తేదీ నుంచి 28వ తేదీ వరకు.. ఒక అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. 42శాతం రిజర్వేషన్లు ఇవ్వడం కోసం మార్చి మొదటి వారంలో క్యాబినెట్ లో తీర్మానం చేసి శాసనసభలో బిల్లు పెట్టి.. బిల్లును మార్చేసి కొన్ని దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో ఎదురుచూస్తున్న బలహీనవర్గాలకు చట్టరూపంగా చట్టబద్ధత కల్పించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది.
ఈ ప్రభుత్వం నుంచి ఒక ప్రతినిధి బృందంగా ప్రధానిని కలుస్తాం. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలందరినీ కలుస్తాం. అలాగే పార్లమెంట్ లోని అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులను కూడా కలుస్తాం. వారందరి మద్దుతు కూడా కూడగడుతాం. వారందరి సహకారంతో పార్లమెంటులో కూడా దీన్ని పాస్ చేయించుకుని పూర్తి చట్టబద్ధత కల్పించి ఓబీసీల దశాబ్దాల చిరకాల వాంఛను నిజం చేసే ప్రక్రియను మొదలు పెడుతున్నాం.
రాష్ట్రంలో ఉన్న 56శాతం బీసీల ప్రయోజనాలను కాపాడటం కోసం రెండు మూడు నెలలు ఆర్థిక భారం పడుతున్నా దాన్ని భరించటానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది” అని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క తెలిపారు.