గ్యాస్ సిలిండర్, పెట్రోల్ ధరలను వాళ్లు అంతగా పెంచారు: రేవంత్ రెడ్డి

Revanth Reddy: పేద ప్రజల సొంతింటి కల ఆనాడు ఇందిరమ్మ పాలనలో నెరవేరిందని రేవంత్ రెడ్డి అన్నారు.

గ్యాస్ సిలిండర్, పెట్రోల్ ధరలను వాళ్లు అంతగా పెంచారు: రేవంత్ రెడ్డి

Revanth Reddy

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలంలో రాములోరి దర్శనం చేసుకుని, మార్కెట్ యార్డులో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంతో పాటు గత బీఆర్ఎస్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. నరేంద్ర మోదీ, కేసీఆర్ కలిసి 400 రూపాయల గ్యాస్ సిలిండరును 1,200 రూపాయలు చేశారని అన్నారు. 40 రూపాయలు ఉండే పెట్రోల్ ధరను 100 రూపాయలు చేశారని చెప్పారు.

పేద ప్రజల సొంతింటి కల ఆనాడు ఇందిరమ్మ పాలనలో నెరవేరిందని రేవంత్ రెడ్డి అన్నారు. పేదవాడు ఆత్మగౌరవంతో బతకాలని ఇందిరమ్మ పథకం ఉందని చెప్పారు. ఇళ్లు ఆడబిడ్డలు పేరు మీదనే ఇస్తామని తెలిపారు. పేదల కలల మీద కేసీఆర్ ఓట్ల వ్యాపారం చేశారని విమర్శించారు.

ప్రతి ఎన్నికలలో చెప్పిందే చెప్పి మోసం చేశారని రేవంత్ రెడ్డి చెప్పారు. కేసీఆర్ మోసాలకు కాలం చెల్లిందని, ఆయన మాటలను నమ్మక ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నామని తెలిపారు. కరకట్ట రిటైల్ వాల్ కి రూ.500 కోట్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 3,500 ఇళ్లు ఇస్తున్నామన్నారు. ప్రభుత్వం వచ్చి 92 రోజులు అయిందని, ఆడబిడ్డలు 24 కోట్ల ట్రిప్పులు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేశారని తెలిపారు.

తాను భద్రాచలం, ఇల్లందులో పాదయాత్ర చేశానని తెలిపారు. భట్టి విక్రమార్క ఆదిలాబాదు నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేశారని అన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చి పేదల ఇళ్లలో వెలుగులు నింపుతున్నామని చెప్పారు. అర్హులైన పేదలకు, జర్నలిస్టులకు కూడా పథకం అమలు చేస్తామని తెలిపారు.

Also Read: ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కంటతడి.. తండ్రిని చూసి కూతురు కృపాలక్ష్మి ఎమోషనల్!