రూ. 5 కే క్రమబద్దీకరణ..వారికి మాత్రమే

telangana new revenue act 2020 : మురికివాడల్లో నివాసం ఉంటున్నపేద, మధ్య తరగతి ప్రజలకు మేలు చేకూరేలా..తెలంగాణ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. అక్రమ లేవుట్లు, ప్లాట్ల క్రమబద్దీకరణ విషయంలో వారు పడుతున్న ఇబ్బందులను పరిగణలోకి తీసుకుంది. కేవలం రూ. 5 రుసుం చెల్లిస్తే..సరిపోతుందని తెలిపింది.
రిజిస్ట్రేషన్ దస్తావేజుల్లో స్లమ్ పేరుంటే…వర్తింపు కానుంది. గత నెల 31న జారీ చేసిన లే అవుట్ల క్రమబద్ధీకరణ జీవో 131లో ఈ మేరకు మరింత స్పష్టతనిస్తూ త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. ప్లాటు విస్తీర్ణం, రిజిస్ట్రేషన్ నాటి మార్కెట్ విలువ ఆధారంగా రూ.వేల నుంచి రూ.లక్షల వరకు రుసుం చెల్లించాల్సి ఉండేది.
జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,179 నోటిఫైడ్ స్లమ్స్, 297 నాన్ నోటిఫైడ్ స్లమ్స్ కలిపి మొత్తం 1,476 మురికివాడలు ఉన్నట్లు అంచనా. రాష్ట్రంలోని ఇతర పురపాలికల్లో మరో 700కి పైగా మురికివాడలు ఉన్నాయి. ప్లాట్లు రిజిస్ట్రేషన్ దస్తావేజులో మురికివాడ పేరు ఉంటే ఈ మేరకు 14శాతం ప్లాటు ధరను ఫీజుగా చెల్లించకుండా మినహాయింపు పొందడానికి వీలుకలగనుంది.
కానీ..ప్లాటు మురికివాడలో ఉన్నా కొన్నిసార్లు దస్తావేజుల్లో సదరు మురికివాడ పేరుకు బదులు వేరే పేర్లు ఉండే అవకాశముంది. ఇలాంటి సందర్భాల్లో సదరు ప్లాట్లకు సంబంధించిన గత 20, 30 ఏళ్ల కాలానికి సంబంధించిన పహాణీలను స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి తీస్తే అందులో మురికివాడ పేరు ఉండే అవకాశాలుంటాయి.
మురికివాడల్లోని ప్లాట్ల విషయంలో ప్లాటు విస్తీర్ణం, మార్కెట్ విలువతో సంబంధం లేకుండా నామమాత్రంగా రూ.5ను ‘క్రమబద్ధీకణ రుసుం’గా చెల్లిస్తే సరిపోతుందని జీవోలో ప్రభుత్వం పేర్కొంది.మురికివాడల్లో నివాసం ఉంటున్నపేద, మధ్య తరగతి ప్రజలకు మేలు చేకూరేలా..తెలంగాణ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది.