Steel Bridge: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి మరో స్టీల్ బ్రిడ్జి.. ఏ రూట్ లోనో తెలుసా?
ప్రజా రవాణాను సులభతరం చేయడమే లక్ష్యంగా చేపట్టిన కీలక ప్రాజెక్టులలో భాగమైన సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి(Steel Bridge) నిర్మాణ పనులు పూర్తయినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
saidabad steel bridge construction completed inauguration soon
- సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి సిద్ధం
- తగ్గనున్న నగర ట్రాఫిక్ కష్టాలు
- త్వరలోనే సీఎం చేతుల ప్రారంభం
Steel Bridge: హైదరాబాద్ మహానగరంలో నానాటికీ తీవ్రమవుతున్న ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రజా రవాణాను సులభతరం చేయడమే లక్ష్యంగా చేపట్టిన కీలక ప్రాజెక్టులలో భాగమైన సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి(Steel Bridge) నిర్మాణ పనులు పూర్తయినట్లు రవాణా, హైదరాబాద్ ఇన్-ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో వాహనాల రద్దీని తగ్గించి, ప్రయాణ సమయాన్ని గణనీయంగా ఆదా చేసేందుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఈ క్రమంలోనే తుది మెరుగులు దిద్దుకున్న ఈ ఆధునిక వంతెన త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానుండటం నగరవాసులకు ఎంతో ఊరటనిచ్చే అంశం.
ప్రాజెక్టు విశేషాలు – ప్రజాప్రతినిధుల పరిశీలన:
సుమారు రూ.680 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన ఈ స్టీల్ బ్రిడ్జి చంచల్‌గూడ జైలు ప్రాంగణం నుంచి ఓవైసీ ఆస్పత్రి, చంపాపేట మార్గాలకు మెరుగైన కనెక్టివిటీని అందిస్తుంది. ఈ వంతెనను మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి అజారుద్దీన్, స్థానిక ఎమ్మెల్యేలు అహ్మద్ బలాలా, కాలేరు వెంకటేష్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్‌తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అతిత్వరలోనే ఈ వంతెనను ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించి ప్రజలకు అంకితం చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టుతో సైదాబాద్, సంతోష్‌నగర్, చంచల్‌గూడ ప్రాంత ప్రజలకు సుదీర్ఘకాలంగా వేధిస్తున్న ట్రాఫిక్ సమస్యలు శాశ్వతంగా తొలిగిపోనున్నాయి.
వేగవంతంగా మూసారాంబాగ్ వంతెన పనులు:
మరోవైపు మూసారాంబాగ్ వద్ద నిర్మిస్తున్న నూతన వంతెన పనులు కూడా చివరి ఘట్టానికి చేరుకున్నాయని, రాకపోకలకు అనువుగా అప్రోచ్ రోడ్ల విస్తరణను వేగవంతం చేశామని అధికారులు స్పష్టం చేశారు. పెరుగుతున్న జనాభా, వాహనాల రద్దీకి అనుగుణంగా కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చేపట్టిన బ్రిడ్జి పనులతో పాటు పెండింగ్‌లో ఉన్న అన్ని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
