Sharmila Party: షర్మిల బహిరంగసభ..6 వేల మందికి మాత్రమే అనుమతి, విజయలక్ష్మి హాజరు
ఖమ్మం వేదికగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించబోతోంది. 2021, ఏప్రిల్ 09వ తేదీ శుక్రవారం ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్లో వైఎస్ షర్మిల.. బహిరంగ సభను నిర్వహించన్నారు.

Sankalpa Sabha
Sharmila Party : ఖమ్మం వేదికగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించబోతోంది. 2021, ఏప్రిల్ 09వ తేదీ శుక్రవారం ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్లో వైఎస్ షర్మిల.. బహిరంగ సభను నిర్వహించన్నారు. తన పార్టీ పేరు, జెండా, పార్టీ లక్ష్యాన్ని ప్రకటించబోతున్నారు. సంకల్ప సభ పేరుతో నిర్వహించే ఈ తొలి సభకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ సతీమణి, షర్మిల తల్లి విజయలక్ష్మి హాజరవనున్నారు. ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరి మధ్యాహ్నానికి ఖమ్మం జిల్లా సరిహద్దు నాయకన్గూడేనికి షర్మిల చేరుకుంటారు. సాయంత్రం ఐదు నుంచి తొమ్మిది గంటల వరకు జరిగే సభలో ఆమె పాల్గొంటారు.
ఇక ఖమ్మం జిల్లా పర్యటనతో.. షర్మిలకు తెలంగాణ సర్కార్ భద్రత కల్పించింది. నలుగురు వ్యక్తిగత భద్రతా సిబ్బందిని ఆమెకు కేటాయించింది. ఇక షర్మిల సభకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సభకు ప్రభుత్వం ఆంక్షలతో కూడిన అనుమతులు మంజూరు చేసింది. లక్ష మందితో సంకల్ప సభను నిర్వహించాలని షర్మిల భావించినా.. కొవిడ్ పరిస్థితులతో కేవలం 6 వేల మందితో నిర్వహించుకునేందుకు పోలీసులు అనుమతినిచ్చారు. అయితే, అభిమానుల ఉత్సాహం చూస్తుంటే సంకల్ప సభకు భారీగానే హాజరయ్యే సూచనలు కనిపిస్తున్నాయంటున్నాయి షర్మిల పార్టీ వర్గాలు.