తమిళనాడు టూర్‌లో బీఆర్ఎస్ నేతలకు ఝలక్.. అధికారం లేకపోతే ఇంతేనా?
ప్రభుత్వ పరంగా కూడా సరైన సహకారం లభించకపోవడం వెనుక పొలిటికల్ వ్యూహమే ఉందన్న..

అధికారం ఉంటే ఆ దర్పమే వేరు. అడుగు వేస్తే సెక్యూరిటీ..అడుగు తీస్తే స్వాగతం. ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తే ప్రోటోకాల్..వేరే రాష్ట్రానికి వెళ్తే రెడ్ కార్పెట్‌తో వెల్‌కమ్. ఇదంతా పవర్‌లో ఉన్నప్పుడు ఉండే హడావుడి. వన్స్ అపోజిషన్‌కు వెళ్తే సీన్ మారిపోతుంది. స్వాగతం మాట అటుంచితే కలిసే నాధుడే ఉండడు. అపాయింట్‌మెంట్ ఇస్తే గొప్ప.
ఈ పరిస్థితులన్నింటినీ తమిళనాడు టూర్‌లో ఫేస్ చేశారు గులాబీ నేతలు. ఒకప్పుడు బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ ఏ రాష్ట్రానికి వెళ్లినా ఘనస్వాగతం దొరికింది. తమిళనాడు, కర్ణాటక, బీహార్, మహారాష్ట్రలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు. ఇప్పుడు సీన్ మారిపోయింది. బీఆర్ఎస్ అపోజిషన్‌లోకి వచ్చింది. పార్టీలు గులాబీ నేతలతో ప్రవర్తించే తీరులోనూ మార్పు వచ్చేసింది.
బీసీ రిజర్వేషన్లు, ప్రాంతీయ పార్టీల నిర్మాణంపై స్టడీ చేసేందుకు తమిళనాడుకు వెళ్లారు బీఆర్ఎస్ నేతలు. చట్టసభల్లో కూడా బీసీలు, మహిళలకు రిజర్వేషన్లను కల్పించాలని డిమాండ్ చేస్తున్న బీఆర్ఎస్.. అందుకు అనుగుణంగా రిజర్వేషన్లు అమలు చేస్తున్న రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని డిసైడ్ అయింది. దీనికి తోడు బలమైన ప్రాంతీయ పార్టీల నిర్మాణాన్ని పరిశీలించి గులాబీ పార్టీని కూడా అదే విధంగా బలోపేతం చేయాలని భావిస్తున్నారు గులాబీ బాస్. అందుకోసం బలమైన ప్రాంతీయ పార్టీలున్న తమిళనాడుకు వెళ్లారు 40 మంది బీఆర్ఎస్ నేతలు.
అపాయింట్‌మెంట్ సైతం దొరకలేదు..
తొలిరోజు బీసీ రిజర్వేషన్ల అమలు తీరును పరిశీలించేందుకు తమిళనాడు బీసీ సంక్షేమశాఖ మంత్రితో భేటీ కావాలని అనుకున్నారు. ఆ తర్వాత బీసీ కమిషన్ ఉన్నతాధికారులతో భేటీ అయి సమగ్ర సమాచారాన్ని సేకరించాలని భావించారు. అయితే చెన్నై వెళ్లిన బీఆర్ఎస్ నేతలకు..ఆ రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి అపాయింట్‌మెంట్ దొరకలేదు.
కొంతమంది అధికారులను కలిసి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. రెండో రోజు తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ కార్యాలయాన్ని సందర్శించి ఆ పార్టీ నిర్మాణంపై పూర్తిస్తాయిలో స్టడీ చేయాలని భావించారు. కానీ డీఎంకే పార్టీ ఆఫీస్‌కు వెళ్లేందుకు గులాబీ పార్టీ నేతలకు అనుమతి లభించలేదు. దీంతో ద్రవిడ వాదంపై పార్టీని మొదలుపెట్టిన ద్రవిడ కజకం పార్టీ ఆఫీస్‌ను సందర్శించి ఆ పార్టీ ఉద్యమ నేతలతో చర్చలు జరిపారు.
తమిళనాడు పర్యటనకు వేసుకున్న ప్రణాళిక పక్కాగా అమలు కాకపోవడం గులాబీ నేతల్లో చర్చకు దారితీస్తోంది. డీఎంకే పార్టీ నిర్మాణం గురించి గులాబీ నేతలు అధ్యయనం చేయాలనుకున్నా అనుమతి దక్కకపోవడం వెనక రాజకీయ కారణాలే ఉన్నాయని బీఆర్‌ఎస్ పార్టీ అంచనా వేస్తుంది.
పొలిటికల్ వ్యూహం
ప్రభుత్వ పరంగా కూడా సరైన సహకారం లభించకపోవడం వెనుక పొలిటికల్ వ్యూహమే ఉందన్న అభిప్రాయం గులాబీ నేతల్లో వ్యక్తం అవుతుంది. డీఎంకే పార్టీ అధినేత తమిళ సీఎం స్టాలిన్ తాము తమిళనాడుకు వెళ్లిన సమయంలోనే ఢిల్లీలో పర్యటిస్తుండటం ఓ కారణమని చెబుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండటం..జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కూటమిలో డీఎంకే పార్టీ కొనసాగుతుండటం ప్రధాన కారణమై ఉంటుందని బీఆర్ఎస్ నేతలు అంచనా వేస్తున్నారు.
రాబోయే రోజుల్లో కేరళ, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో బీసీ రిజర్వేషన్ల అధ్యయనం కోసం పర్యటించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. తమిళనాడు అనుభవంతో ఇతర రాష్ట్రాల పర్యటన సందర్భంగా ముందస్తు ప్రణాళిక వేసుకుని..ఆచితూచి వ్యవహరించాలని బీఆర్ఎస్ భావిస్తోంది.
కూటమి నుంచి రాజ్యసభకు వెళ్లే నేతలెవరు? జనసేనాని బ్రదర్ కేంద్రమంత్రి కాబోతున్నారా?