ఫేమస్ అయ్యేందుకే సొంత అక్కను చంపిండు..! హత్యకు ముందు ఇన్‌స్టాలో రీల్.. కొత్తూరు హత్య ఘటనలో సంచలన విషయాలు..
ఫేమస్ అయ్యేందుకే సొంత అక్కను చంపిండు..! హత్యకు ముందు ఇన్‌స్టాలో రీల్.. కొత్తూరు హత్య ఘటనలో సంచలన విషయాలు..

Rangareddy district Brother and Sister incident
Rangareddy Districts: రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంబజర్ల గ్రామంలో ఓ తమ్ముడు సొంత అక్కనే చంపేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో ఫోన్లో మాట్లాడుతోందనే నెపంతో తన అక్క రుచిత (21)ను తమ్ముడు రోహిత్ గొంతు నులిమి హత్య చేశాడు. ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవా అంటూ కిరాతకంగా చంపేశాడు. తండ్రి ఫిర్యాదుతో పోలీసులు రోహిత్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పోలీసుల విచారణలో దిగ్భ్రాంతికి గురిచేసే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Also Read: Dharmasthala : వీడని ధర్మస్థలి మిస్టరీ.. మృతదేహాలెక్కడ?
పోలీసుల దర్యాప్తులో భాగంగా నిందితుడు రోహిత్ ఫోన్‌ను స్వాధీనం చేసుకొని దానిని తనిఖీ చేశారు. అయితే, ఈ హత్య ఘటనకు ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో అతను ఓ రీల్ చేసినట్లు గుర్తిచారు. ఆ రీల్‌లో ‘బాగా ఫేమస్ అవ్వాలి మామా.. బాగా బతికి పేరు తెచ్చుకునే ఓపిక లేదు.. బాగా చంపి ఫేమస్ అయ్యేదా.. ’అని చెప్పినట్లుగా తెలుస్తోంది.
దీంతో పథకం ప్రకారమే యువకుడు తన సొంత అక్కను హతమార్చినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. రుచిత తండ్రి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు తొలుత పరువు హత్యగా భావించారు.. కానీ, దర్యాప్తులో భాగంగా ఫేమస్ అవ్వటం కోసమే హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే, పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా త్వరగా ఫేమస్ అవ్వాలనే భావనతో కొందరు యువత పెడదారి పడుతున్నారు. తాజా ఘటన యువతలో పెరుగుతున్న విపరీత పోడకలు, సామాజిక మాధ్యమాల ప్రభావం ఎంత ప్రమాదకరంగా మారుతున్నాయో తెలియజేస్తోంది. రోహిత్ లాంటి యువకులు ఫేమస్ అవ్వాలని నేరాలకు పాల్పడటం, హింసాత్మక ఆలోచనలు చేయడం వంటి ధోరణులు ఆందోళన కలిగిస్తున్నాయి.