18ఏళ్ల క్రితం భార్య.. ఇప్పుడు తండ్రీకొడుకు.. ఒకే చెరువులో శవాలై తేలారు.. అసలేం జరిగిందంటే..
Crime News 18ఏళ్ల క్రితం పరశురాములు తల్లి చంద్రవ్వ గ్రామంలోని చెరువు పడి చనిపోగా.. అదే చెరువులోపడి పరశురాములు, అతని తండ్రి తాజాగా మరణించారు.

Lake
Crime News : సిద్ధిపేట జిల్లా అక్బర్‌పేట-భూంపల్లి మండలం ఎనగుర్తి గ్రామంలో విషాద ఘటన జరిగింది. 18ఏళ్ల క్రితం పరశురాములు తల్లి చంద్రవ్వ గ్రామంలోని చెరువు పడి చనిపోగా.. అదే చెరువులోపడి పరశురాములు, అతని తండ్రి తాజాగా మరణించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఎనుగుర్తి గ్రామంకు చెందిన గురుజాల ఎల్లయ్య, చంద్రవ్వల కుమారుడు పరశురాములు. చంద్రవ్వ 18ఏళ్ల క్రితం గ్రామ శివారులోని బండ్లకుంట చెరువులో దూకి మరణించింది. పరశురాములు తాగుడుకు బానిస అయ్యాడు. అతనికి పెళ్లైంది. ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే, గ్రామంలో ఓ మహిళ మరణించగా.. గురువారం జరిగిన అంత్యక్రియల్లో డప్పు వాయించేందుకు తండ్రి ఎల్లయ్య, పరశురాములు కలిసి వెళ్లారు. సాయంత్రం ఇంటికి వచ్చిన పరశురాములు.. తన భార్య గీతను మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
భర్త పరశురాములు అప్పటికే ఫుల్లుగా మద్యం సేవించి ఉండటాన్ని గమనించిన గీత.. తాను డబ్బులు ఇవ్వనని చెప్పింది. దీంతో అతను గట్టిగా కేకలు వేయడంతో కొంత డబ్బును ఇచ్చింది. మరిన్ని డబ్బులు కావాలని.. ఇవ్వకుంటే నేను చనిపోతానంటూ పరశురాములు భార్యను బెదిరించాడు. అయినా ఇవ్వకపోవటంతో ఆవేశంగా గ్రామ శివారులోని బండ్లకుంట చెరువు వైపు వెళ్లాడు.
కొడుకు ఆవేశంగా చెరువువైపు వెళ్లాడని తెలుసుకున్న తండ్రి ఎల్లయ్య పరుగెత్తుకుంటూ చెరువు వద్దకు వెళ్లాడు. పరశురాములు చెరువులో దూకడాన్ని గమనించిన ఎల్లయ్య.. కొడుకును కాపాడుకునేందుకు అతనుకూడా చెరువులోకి దూకాడు. ఇద్దరికి ఈత రాకపోవటంతో చెరువులో మునిగిపోయి మరణించారు.
భర్త, మామలు కనిపించక పోవటంతో గీత, ఆమె తల్లి లక్ష్మి వారిని వెతుక్కుంటూ చెరువు వద్దకు వెళ్లారు. చెరువు వద్ద ఎల్లయ్యకు సంబంధించిన బట్టలు ఉండటాన్ని గమనించి గ్రామస్తులకు విషయాన్ని తెలిపారు. దీంతో గ్రామస్తులు చెరువులోకి వెళ్లి చూడగా.. పరశురాములు మృతదేహం లభ్యమైంది. ఆ తరువాత ఎల్లయ్య మృతదేహం కూడా దొరికింది. భూంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. 18ఏళ్ల క్రితం పరశురాములు తల్లి చంద్రవ్వ అదే చెరువులోపడి మరణించింది. తాజాగా. తండ్రీకొడుకు సైతం అదే చెరువులో పడి మరణించారు.