తెలంగాణ కాంగ్రెస్‌లో ఆ నేతల కామెంట్స్‌తో అలజడి

పార్టీలో ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు, కీలక పదవుల్లో ఉన్నవారు మాట్లాడిన మాటలు తలనొప్పిగా మారాయట.

తెలంగాణ కాంగ్రెస్‌లో ఆ నేతల కామెంట్స్‌తో అలజడి

CM Revanth Reddy

Updated On : November 6, 2024 / 1:46 PM IST

అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. కాంగ్రెస్ లీడర్ల రూటే సెపరేటు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉంటుంది హస్తం పార్టీ నేతల తీరు. నేతలంతా తామే సుప్రీం అన్నట్లుగా మాట్లాడుతుంటారు. ఇప్పుడు పవర్లో ఉన్నప్పటికీ కూడా కొందరు నేతల తీరులో మార్పు లేదట. అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో నేతలు ఎవరికి తోచింది వారు మాట్లాడి పార్టీకి తలనొప్పులు తెచ్చిపెడుతున్నారట.

పార్టీలో ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు, కీలక పదవుల్లో ఉన్నవారు మాట్లాడిన మాటలు తలనొప్పిగా మారాయట. సీనియర్లు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని, ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడాలని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సూచించినా కొందరి నేతల తీరులో మార్పు రావడం లేదు. కొందరు లీడర్లు నోరు జారుతుండటంపై పార్టీ పెద్దలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి పలుమార్లు చేసిన కామెంట్స్ పార్టీకి నష్టం చేశాయని పలువురు హస్తం నేతలు భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ నేతలకే భద్రత లేకుండా పోయిందంటూ రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు జీవన్ రెడ్డి. గతంలో కేసీఆర్ ఫిరాయింపులు ప్రోత్సహించి తప్పుచేశారని ఇదే తప్పును కాంగ్రెస్ నేతలు ఎందుకు చేస్తున్నారని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.

అధిష్ఠానానికి లేఖ
కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన కేసీఆర్ని ఆదర్శంగా తీసుకోవాలా? ఫిరాయింపులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న రాహుల్ గాంధీని ఆదర్శంగా తీసుకోవాలా అంటూ అధిష్ఠానానికి లేఖ రాశారు. జీవన్రెడ్డి ఆవేదనను అర్థం చేసుకుంటామని పైకి నేతలు చెప్తున్నా.. ఇలా ఓపెన్ స్టేట్మెంట్లతో పార్టీని ఇబ్బంది పెట్టడం సరికాదంటున్నారు మెజార్టీ నేతలు.

ఇక కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ హైడ్రా, మూసీ విషయంలో చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. మూసీ బాధితులకు అండగా ఉంటానని ప్రకటించారు. ప్రభుత్వం మొండిగా, దౌర్జన్యంగా, అన్యాయంగా ముందుకు వెళ్తే ఒక న్యాయవాదిగా ప్రభుత్వంపై కేసు వేసి ప్రజల తరఫున కొట్లాడుతానని మధుయాష్కీ ప్రకటించారు.

ఇక ఆస్తులు సంపాదించుకోవడానికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని, పార్టీలోకి వచ్చే ఎమ్మెల్యేలకు పార్టీపై ప్రేమ లేదని ప్రకటించారు మధుయాష్కీ. ఆయన కామెంట్లను కవర్ చేసే ప్రయత్నం చేశారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి సహకరించడానికి వచ్చారని వారిని గౌరవించుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పుకొచ్చారు.

తీన్మార్ మల్లన్న కూడా..
అంతకముందు మంత్రి కొండా సురేఖ నాగార్జున ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి కారణమయ్యాయి. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న కూడా బీసీ సభలు నిర్వహిస్తూ పార్టీని ఇబ్బంది పెట్టే ప్రకటనలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ నుంచి చివరి రెడ్డి ముఖ్యమంత్రి అని, గ్రూప్-1 విషయంలో ప్రభుత్వం తప్పు చేస్తోందని మాట్లాడారు. నల్గొండ రెడ్డి మంత్రులు తనని ఓడగొట్టడానికి ప్రయత్నం చేశారని , మంత్రి పొంగులేటికి అన్ని ఆస్తులు ఎలా వచ్చాయంటూ బాంబుల మీద బాంబులు వేస్తునారు.

సియోల్ నగర అభివృద్ధిపై స్టడీ కోసం పలువురు జర్నలిస్ట్ లను ప్రభుత్వం కొరియాకు పంపించడాన్ని మల్లన్న తప్పుపట్టారు. ఈ విషయాలన్నీ ఈ మధ్యే గాంధీభవన్లో జరిగిన ఓ సమావేశంలో చర్చకు వచ్చాయట. సీఎంను ఉద్దేశించి మల్లన్న చేసిన కామెంట్స్ పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయని కొందరు నేతలు ప్రస్తావించినట్లు టాక్. సీఎం జోక్యం చేసుకుని ఎలాంటి అనుమానాలు ఉన్నా ప్రభుత్వం నుంచి క్లారిటీ తీసుకుని మాట్లాడాలని సూచించారట. క్లారిటీ తీసుకోకుండా ఏది పడితే అది మాట్లాడితే పార్టీకి, ప్రభుత్వానికి నష్టం కలుగుతుందని సీఎం చెప్పినట్లు తెలుస్తోంది.

పలువురు నేతలు తరచుగా చేస్తున్న వ్యాఖ్యలు పార్టీని ఇబ్బంది పెడుతుండటంతో సీరియస్ గా ఉండాలని పీసీసీ చీఫ్, సీఎం నిర్ణయం తీసుకున్నారట. ఇకపై పార్టీకి ఇబ్బంది కలిగించే కామెంట్స్ చేస్తే ఊరుకునేది లేదని, నేతలు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే ఇబ్బందులు తప్పవని తేల్చి చెప్పారట. సీఎం, పీసీసీ చీఫ్ వార్నింగ్ తో అయినా పార్టీ నేతల్లో మార్పు వస్తుందో తేదో చూడాలి.

వెక్కి వెక్కి ఏడ్చిన కమలా హారిస్ మద్దతుదారులు