SLBC Tunnel: నో చాన్స్.. ఆ ఎనిమిది మంది ప్రాణాలపై ఆశలు లేనట్లే..! అత్యంత భయానకంగా పరిస్థితులు..
ఎస్ఎల్బీసీ టన్నెల్ లో చిక్కుకుపోయిన ఎనిమిది మంది జాడ ఇంకా దొరకలేదు. ఐదు రోజులుగా నిరంతర ప్రయత్నాల తర్వాత టన్నెల్ లో ..

SLBC Tunnel
SLBC Tunnel Incident: ఎస్ఎల్బీసీ టన్నెల్ లో చిక్కుకుపోయిన ఎనిమిది మంది జాడ ఇంకా దొరకలేదు. ఐదు రోజులుగా నిరంతర ప్రయత్నాల తర్వాత టన్నెల్ లో ప్రమాదం జరిగిన చోటుకు ఆర్మీ రెస్క్యూ టీం వెళ్లింది. అయితే, ఇప్పటి వరకు ఏ మూలో సజీవంగా ఉంటారనుకున్న ఎనిమిది మంది ప్రాణాలపై ఇక ఆశలు లేనట్టేనని అధికారులు అంటున్నారు. వాళ్లంతా బురదలో కూరుకుపోయి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగంలో పనులు నిర్వహిస్తుండగా గత శనివారం ఉదయం సొరంగం పైకప్పు కూలిపోయిన విషయం తెలిసిందే. ప్రమాదం సమయంలో యాబై మంది వరకు కార్మికులు అందులో పనిచేస్తుండగా.. అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అయితే, వారిలో గురుప్రీత్ సింగ్, సన్నీ సింగ్, మనోజ్ కుమార్, శ్రీనివాస్, సందీప్ సాహూ, అనుజ్ సాహూ, సంతోశ్ సాహూ, జక్తాజస్ అనే ఎనిమిది మంది టన్నెల్ లోనే చిక్కుకని పోయారు. వారిని బయటకు తీసుకొచ్చేందుకు ఐదు రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ టీం, ర్యాట్ హోల్ మైనర్స్ చెప్తున్న దాని ప్రకారం.. టన్నెల్ చివరి భాగంలో పరిస్థితులు అత్యంత భయానకంగా ఉన్నాయి. ఎటు చూసినా మట్టి, బురద, శిథిలాలే తప్ప ఆ ఎనిమిది మంది జాడ కనిపించలేదు. పైకప్పు కూలిన ప్రాంతం నుంచి టన్నెల్ 500 మీటర్ల వరకు మట్టి, బురద నీటితో ఊబిలా మారింది. టన్నెల్ ఎత్తు 10.2 మీటర్లు కాగా.. ప్రమాదం జరిగిన ప్రాంతంలో దాదాపు 9.2 మీటర్ల ఎత్తులో మట్టి దిబ్బలు ఉన్నాయి. ప్రమాదంలో గల్లంతైన ఎనిమిది మంది చనిపోయి టన్నెల్ మిషన్ చుట్టూ బురదలో కూరుకుపోయి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలాఉంటే.. కూలిన ప్రాంతంలో శిథిలాలను, మట్టిని తొలగిస్తే పైనుంచి మరింత మట్టి కూలే ప్రమాదం ఉందని రెస్క్యూ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి భయానకరంగా ఉంది. గంటకు కనీసం 5వేల నుంచి 10వేల లీటర్ల వరకు నీరు వస్తుండటంతో రెస్క్యూ చేపట్టడం అతిపెద్ద సవాలుగా మారింది. నీటిని పవర్ ఫుల్ మోటార్లతో తోడేస్తున్నా ఊబిలా మారిన బురదను తొలగించే పరిస్థితి కనిపించడం లేదు. ఈ టన్నెల్ లోపల ఆక్సిజన్ కూడా అందడం లేదని, ఊపిరి తీసుకోవడమూ కష్టమవుతోందని సిబ్బంది చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టన్నెల్ లో గల్లంతైన వారు ప్రాణాలతో బయటపడే ఛాన్స్ లేదని అంచనా వేస్తున్నారు.