Helping Covid Patients: రియల్ హీరోస్.. కరోనా సమయంలో సాయం చేస్తున్నారు

Helping Covid Patients: రియల్ హీరోస్.. కరోనా సమయంలో సాయం చేస్తున్నారు

Helping Covid Patients

Updated On : May 17, 2021 / 9:42 PM IST

Real Heroes: కరోనా కరాళ నృత్యం చేస్తున్న సమయంలో తమకు తగ్గట్టుగా ప్రతిఒక్కరూ సాయం చేస్తున్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా కొందరు ఉండగా మరికొందరు స్వచ్ఛందంగా సాయం చేస్తూ రియల్ హీరోస్ అనిపించుకుంటున్నారు. సొంతవాళ్లే దగ్గరకు రాని సమయంలో అన్నీ తామై అన్నింటా తామై అన్నట్లుగా ముందు అడుగులు వేస్తున్నారు.

లేటెస్ట్‌గా అమెరికా నుంచి తిరిగి వచ్చిన హైదరాబాద్‌కు చెందిన తరుణ్ కప్పాలా అనే ఎన్‌ఆర్‌ఐ యువ సాప్ట్ వేర్ ఇంజనీర్.. ఒక కారును కొని ఆక్సిజన్ సదుపాయం కల్పించి అంబులెన్స్‌గా మార్చేశాడు.

Image

ఆ అంబులెన్స్‌ ద్వారా కోవిడ్ -19 పాజిటివ్ వచ్చిన రోగులను ఒక్క పైసా కూడా తీసుకోకుండా ఉచితంగా ఆసుపత్రులకు తరలిస్తున్నాడు. తన బందువు కరోనాతో చనిపోగా.. మృతదేహాన్ని తీసుకెళ్లడానికి అంబులెన్స్ సర్వీస్ ప్రొవైడర్ 34వేల రూపాయలు వసూలు చేశారు.


దాంతో.. ఈ సేవలను ఉచితంగా ఇవ్వడానికి నిర్ణయించుకుని, ఒక వారంలోనే 20 మందికి పైగా కోవిడ్ -19 రోగులను ఆసుపత్రులకు తీసుకెళ్లారు తరుణ్. అక్కడ బెడ్ దొరికే వరకు ఉచితంగా కారులోనే ఆక్సిజన్ అందించారు. తరుణ్ హైదరాబాద్‌కు తిరిగి రాకముందు యుఎస్ఎలో డెలాయిట్, టిసీస్, అమెజాన్ వంటి సాప్ట్ వేర్ సంస్థల్లో పనిచేశాడు.

ఖమ్మంకు చెందిన ఓ యువకుడు కూడా ఇదేవిధంగా కరోనా బాధితులను తన ఇన్నోవా కారులో ఆస్పత్రులకు చేరుస్తూ స్పూర్తిదాయకంగా నిలుస్తున్నాడు. కరోనా పాజిటివ్ అని తేలగానే సొంత కుటుంబ సభ్యులే ముఖం చాటేస్తున్న రోజుల్లో.. ఆస్పత్రికి తరలిస్తూ ఆపద్బాంధవుడు అయ్యాడు నల్లమల రంజిత్.

May be an image of car, road and text that says "AP16BM7465"

ఖమ్మం నగరంలో గట్టయ్య సెంటర్‌లో చిన్న హోటల్ నడుపుతూ జీవనం సాగించే నల్లమల రంజీత్.. కరోనా వైరస్ సోకి ఆస్పత్రికి చేరుకోలేక ప్రాణాపాయస్థితిలో ఉన్నవారిని ఆస్పత్రులకు చేరుస్తున్నారు. సొంత వాహనంలో పది రోజులుగా 40మంది కరోనా రోగులను ఖమ్మంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు చేరుస్తున్నారు. వ్యాధి తీవ్రంగా ఉన్న రోగులను హైదరాబాద్‌కు కూడా తన వాహనంలో తీసుకుని వెళ్తున్నారు.

ఇంటి వద్ద చికిత్స పొందుతూ పరిస్థితి విషమించిన రోగులను వెంటనే ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించాల్సి ఉంటుంది. అటువంటివారు సాయం అంటూ ఫోన్ చేస్తే స్పందిస్తున్నారు రంజీత్.