త్వరలోనే స్మితా సబర్వాల్‌కు కీలక పోస్ట్? తెలంగాణ సర్వీసుల్లోకి అకున్ సబర్వాల్!

రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు తీసుకోగానే అందరు IAS అధికారుల్లాగా స్మితా సబర్వాల్ ఆయనను కలవడానికి వెళ్లకపోవడం వల్లే ప్రాధాన్యం లేని పోస్ట్ దక్కిందన్న ప్రచారం ఉంది

త్వరలోనే స్మితా సబర్వాల్‌కు కీలక పోస్ట్? తెలంగాణ సర్వీసుల్లోకి అకున్ సబర్వాల్!

Updated On : October 21, 2024 / 9:15 PM IST

స్మితా సబర్వాల్.. అకున్‌ సబర్వాల్. IAS, IPS అధికారులైన ఈ దంపతులు.. తమ పనితీరుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీనియర్ IAS అయిన స్మితా సబర్వాల్ కీలకంగా పనిచేశారు. సీఎంవోలో అప్పటి సీఎం కేసీఆర్ కార్యదర్శిగా పనిచేస్తూ ఇరిగేషన్ వంటి ముఖ్యమైన శాఖలను పర్యవేక్షించారు.

డైనమిక్ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్న స్మితా సబర్వాల్.. ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా మాట్లాడతారని చెబుతుంటారు. తనకు అప్పగించిన పనిని ఆమె సమర్థవంతంగా నిర్వహిస్తారన్న టాక్ ఉన్నతాధికారుల్లో ఉంది. అప్పట్లో ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిశీలనకు హెలికాప్టర్ వాడిన ఏకైక IAS అధికారిణిగా సంచలనం రేపారు.

ఈ క్రమంలోనే స్మితా సబర్వాల్‌పై అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నేతలు ఆరోపణలు, విమర్శలు చేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ అధికారం కోల్పోయి, కాంగ్రెస్ పవర్‌లోకి రాగానే స్మితా సబర్వాల్‌ను ఏ మాత్రం ప్రాధాన్యం లేని పోస్ట్‌కు బదిలీ చేశారు. ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో ఉన్న స్మితా సబర్వాల్‌ను గ్రూప్-1 అధికారి స్థాయి ఫైనాన్స్ కమీషన్ సెక్రటరీగా నియమించింది కాంగ్రెస్ ప్రభుత్వం.

అకున్ సబర్వాల్‌కు పోలీస్ శాఖలో కీలక బాధ్యతలు?
స్మితా సబర్వాల్ భర్త, అకున్ సబర్వాల్ ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. త్వరలోనే ఆయన తెలంగాణ సర్వీసుల్లోకి వస్తున్నారు. దీంతో అకున్ సబర్వాల్‌కు పోలీస్ శాఖలో కీలక బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోందట. గతంలో డ్రగ్స్ కంట్రోల్ డైరెక్టర్‌గా పనిచేసిన అకున్ సబర్వాల్ సమర్ధవంతంగా బాధ్యతలు నిర్వర్తించారన్న పేరుంది. ఈ క్రమంలో మరోసారి అకున్ సవర్వాల్‌కు తెలంగాణలో మాదకద్రవ్యాల నిర్మూలనకు సంబంధించిన పోస్ట్‌లో నియమిస్తారని టాక్ వినిపిస్తోంది.

ప్రధానంగా బీఆర్ఎస్ నేతలకు డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నాయని..సేమ్‌ టైమ్‌ డ్రగ్స్‌ నిర్మూలణకు కట్టుబడి ఉన్నామని చెప్తున్న కాంగ్రెస్ పెద్దలు..అకున్ సబర్వాల్‌కు డ్రగ్స్ కంట్రోల్‌కు సంబంధించిన బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని అనుకుంటున్నారట. గతంలో పనిచేసిన అనుభవంతో అతడైతేనే అక్రమాలన్నీ బయటకు వస్తాయనుకుంటున్నారట. ఈ క్రమంలో అకున్ సబర్వాల్ భార్య, IAS స్మితా సబర్వాల్‌కు కూడా కీలక బాధ్యతలు అప్పగించబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది.

నలుగురు IAS అధికారులు ఏపీకి వెళ్లడంతో..
తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ క్యాడర్‌కు చెందిన నలుగురు IAS అధికారులు DOPT ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిపోయారు. దీంతో తెలంగాణలో ఐఏఎస్‌ అధికారుల కొరత ఏర్పడింది. ఇప్పటికే ఒక్కో IAS అధికారికి రెండు మూడు శాఖలను అప్పగించారు. ఈ క్రమంలో సమర్ధవంతమైన స్మితా సబర్వాల్ లాంటి ఆఫీసర్ల సేవలను వాడుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తున్నారట.

పైగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పనిచేసిన ఐఏఎస్ అధికారులు రామకృష్ణారావు, నవీన్ మిట్టల్, జయేశ్ రంజన్ లాంటి వారిని కీలక పోస్టుల్లో కొనసాగిస్తోంది రేవంత్ సర్కార్. కాబట్టి బీఆర్ఎస్ హయాంలో సీఎం సెక్రటరీగా పనిచేసి, ప్రస్తుతం ఫైనాన్స్ కమీషన్‌లో ఉన్న స్మితా సబర్వాల్‌కు కూడా కీలక ప్రభుత్వ శాఖను అప్పగించే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.

రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు తీసుకోగానే అందరు IAS అధికారుల్లాగా స్మితా సబర్వాల్ ఆయనను కలవడానికి వెళ్లకపోవడం వల్లే ప్రాధాన్యం లేని పోస్ట్ దక్కిందన్న ప్రచారం ఉంది. అయితే డైనమిక్ ఆఫీసర్‌గా పేరున్న ఆమెకు కీలక బాధ్యతలు అప్పగిస్తే ప్రభుత్వానికే మంచిదన్న అభిప్రాయానికి వచ్చారట. అకున్‌ సబర్వాల్‌ను అయితే డ్రగ్స్ కంట్రోల్‌ కోసం బాధ్యతలు అప్పగించే యోచన ఉంటే..స్మితా సబర్వాల్‌కు ఏ బాధ్యతలు అప్పగిస్తారనే దానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

మహిళలకు సీఎం చంద్రబాబు దీపావళి కానుక..!