ఓరి దుర్మార్గుడా.. ఫ్రెండ్ ఇంట్లోలేని సమయంలో ముసుగేసుకొని వెళ్లాడు.. ఫ్రెండ్ భార్యను కత్తితో గాయపర్చి..
ఓ ఐటీ ఉద్యోగి విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి తన సొంత ఫ్రెండ్ నే మోసం చేసేందుకు ప్రయత్నించాడు. పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు.

software employee theft
Hyderabad: ఓ ఐటీ ఉద్యోగి విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి తన ఫ్రెండ్ నే మోసం చేసేందుకు ప్రయత్నించాడు. తన స్నేహితుడు లేని సమయంలో ముసుగేసుకొని అతడి ఇంట్లోకిదూరి దొంగతనం చేశాడు. అడ్డొచ్చిన ఫ్రెండ్ భార్యను గాయపర్చాడు. ఈ ఘటన హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. రంగంలోకి దిగిన ఖాకీలు దొంగను పట్టుకున్నారు. తొలుత తటపటాయించినా పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో దొంగతనం చేసింది నేనే అని ఒప్పుకున్నాడు. ఆఫీస్ లో తనతో రోజూ కలిసిఉండే స్నేహితుడే తన ఇంట్లో దొంగతనం చేశాడని తెలియడంతో బాధితుడు ఆశ్చర్యపోయాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
కడప జిల్లాకు చెందిన కాళహస్పి హరికృష్ణ బీటెక్ పూర్తిచేసి ఉద్యోగం నిమిత్తం గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ సంస్థలో సాప్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అదే కార్యాలయంలో మణికంఠ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. హరికృష్ణ, మణికంఠ స్నేహితులు. హరికృష్ణ విలాసవంతమైన జీవితానికి అలవాటుపడ్డాడు. తన విలాసాలకు కావాల్సినన్ని డబ్బులు లేకపోవటంతో తన ఫ్రెండ్ ఇంట్లోనే దొంగతనం చేయాలని భావించాడు. తన ఫ్రెండ్ మణికంఠ ఇంట్లోలేడని గుర్తించి ఈనెల 25న ముసుగేసుకొని హరికృష్ణ దొంగతనానికి వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో మణికంఠ భార్య 18నెలల కుమార్తెతో ఉంది. ముసుగేసుకొని ఇంట్లోకివెళ్లి ఫ్రెండ్ భార్యను కత్తితో బెదిరించాడు. ఆమెను గాయపర్చి రెండు బంగారు గాజులు ఎత్తుకెళ్లాడు. ఈ ఘటనపై మణికంఠ మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసులు రంగంలోకిదిగి మణికంఠ ఇంట్లో దొంగతనంకు వచ్చింది ఎవరో గుర్తించేందుకు విచారణ మొదలుపెట్టారు. ఈ క్రమంలో మణికంఠ స్నేహితులను విచారించగా.. హరికృష్ణపై అనుమానంతో అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయాన్ని ఒప్పుకున్నాడు. తన ఫ్రెండ్ ఇంట్లో తానే దొంగతనం చేసినట్టు చెప్పాడు. దీంతో అతని వద్ద నుంచి రూ. 60వేల విలువైన 20గ్రాములు కలిగిన రెండు బంగారు గాజులు రికవరీ చేశారు. ఈ కేసుపై పోలీసులు మాట్లాడుతూ.. హరికృష్ణ భార్యతో విబేధాల కారణంగా విడాకులు తీసుకున్నాడని, విలాసవంతమైన జీవనానికి అలవాటుపడి డబ్బులు సరిపోక దొంగతనాలు, దోపిడీలకు పాల్పడినట్లు తెలిపారు.