Hyderabad Crime : హైదరాబాద్‌లో దారుణ ఘటన.. ఫ్లీజ్ నాన్నా.. అలా చేయకండి అంటూ వేడుకున్న కొడుకు.. చివరికి విషాదం..
Hyderabad Crime News : తల్లిదండ్రుల మధ్య తరచూ జరిగే గొడవలతో మనస్తాపానికి గురైన 15ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన గచ్చిబౌలిలో చోటు చేసుకుంది.
Son commits suicide dispute between parents tragic incident in Gachibowli, Hyderabad
- తల్లిదండ్రుల మధ్య నిత్యం ఘర్షణలు
- మనస్థాపానికి గురై కుమారుడు ఆత్మహత్య
- గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన
Hyderabad Crime News : హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. తల్లిదండ్రుల మధ్య తరచూ జరిగే గొడవలతో మనస్తాపానికి గురైన 15ఏళ్ల బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అమ్మానాన్నా ప్లీజ్ గొడవపడొద్దు నేను వెళ్లిపోతున్నా అంటూ అమ్మమ్మ ఇంటికి వెళ్లి ఓ గదిలో చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన ప్రతిఒక్కరి హృదయాలను పిండేస్తోంది.
Also Read : Rajkumar Selfie Video : నా చావుకు ఆ నలుగురే కారణం.. షాబాద్ హత్యల నిందితుడు రాజ్‌కుమార్ సెల్ఫీ వీడియో వైరల్..
గచ్చిబౌలి వడ్డెర బస్తీకి చెందిన ఎల్లయ్య, అతని భార్య కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎల్లయ్య ప్రతీరోజూ మద్యం తాగొచ్చి ఇంట్లో భార్యతో గొడవపడేవాడు. భర్త వేధింపులు భరించలేక భార్య కూడా ఎదురుతిరిగేది. దీంతో ఇద్దరి మధ్య వాదనలు జరిగేవి. ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు నిత్యకృత్యంగా మారాయి. ఈనెల 11వ తేదీ రాత్రి కూడా ఎల్లయ్య తాగివచ్చి భార్యతో గొడవపడ్డాడు. ఆరోజు ఇద్దరూ కొట్టుకునే స్థాయికి ఘర్షణ వెళ్లడంతో పెద్ద కుమారుడు మోహన్ (15) జోక్యం చేసుకొని వారికి సర్దిచెప్పాడు.
రోజూ ఇలా గొడవ పడొద్దు నాన్నా.. ఏమైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోండి.. అంటూ మోహన్ తన తండ్రికి చెప్పే ప్రయత్నం చేశాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన తండ్రి ఎల్లయ్య.. నువ్వు ఎవడివిరా చెప్పడానికి..? నాకే ఎదురు చెప్పేంత ధైర్యం వచ్చిందా? అంటూ మోహన్‌ను తోసేశాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన మోహన్.. మీరు ఇక మారరా..? నేను వెళ్లిపోతున్నా అంటూ.. అదే కాలనీలో నివసిస్తున్న తన అమ్మమ్మ ఇంటికి వెళ్లి చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్దిసేపటి తరువాత బాలుడి తల్లి కుమారుడిని వెతుక్కుంటూ అక్కడకు వెళ్లగా.. చీరతో ఉరేసుకొని కనిపించాడు. వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మోహన్ మృతి చెందాడు. కొడుకు మృతితో తల్లి గుండెలు బాదుకుంటూ భోరున విలపించడం స్థానికులను కలచివేసింది.
