Sri Seeta Rama Kalyanam : భద్రాద్రిలో శ్రీ సీతారాముల కల్యాణం.. ముస్తాబైన మిథిలా స్టేడియం

రాములోరి కల్యాణ వేడుక ప్రత్యక్ష ప్రసారానికి ఈసీ అనుమతి ఇవ్వడంతో.. మిథిలా స్టేడియంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఎండలు, ఉక్కపోతతో భక్తులు ఇబ్బంది పడకుండా మిథిలా స్టేడియంలో ఏసీలతోపాటు 100 కూలర్లు, 270 ఫ్యాన్లు అధికారులు ఏర్పాటు చేశారు.

Sri Seeta Rama Kalyanam : భద్రాద్రిలో శ్రీ సీతారాముల కల్యాణం.. ముస్తాబైన మిథిలా స్టేడియం

Sri Seeta Rama Kalyanam

Sri Seeta Rama Kalyanam – Bhadrachalam : భద్రాచల క్షేత్రంలో సీతారాముల కల్యాణానికి సర్వంసిద్ధమైంది. శ్రీరామనవమి సందర్భంగా ఈ మహాద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాలనుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో భద్రాచలంకు తరలివస్తున్నారు. మిథిలా మండపంలో ఉదయం 10.30 గంటల సీతారాముల కల్యాణమహోత్సవం ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు అభిజిత్ లగ్నంలో స్వామివారి కల్యాణం నిర్వహించనున్నారు. సీతారాముల కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు వచ్చే భక్తుల కోసం ఆలయ నిర్వాహకులు, అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇదిలాఉంటే.. తానీషా కాలం నుంచి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలను తీసుకొచ్చే ఆనవాయితీ ఉంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత 2015, 2016లో అప్పటి సీఎం కేసీఆర్ పట్టువస్త్రాలను తీసుకొచ్చారు. ఆ తరువాత భద్రాచలం రామాలయానికి రాలేదు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలను తీసుకురావాల్సి ఉంది.. కానీ, లోక్ సభ ఎన్నికల కోడ్ అమలులో ఉండటం వల్ల రేవంత్ రెడ్డి భద్రాచలంలో సీతారాములవారి కల్యాణానికి హాజరు కావడం లేదు. అయితే, ప్రభుత్వం తరపున సీఎస్ శాంతికుమారి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

Also Read : Bhadrachalam Seetharamula Kalyanam : రాములోరి కల్యాణంపై ఈసీ ఆంక్షలు..! భక్తుల్లో తీవ్ర ఆందోళన

ప్రత్యక్ష ప్రసారానికి ఈసీ అనుమతి ..
శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. రాములోరి కల్యాణ వేడుక ప్రత్యక్ష ప్రసారానికి ఈసీ అనుమతి ఇవ్వడంతో.. మిథిలా స్టేడియంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఎండలు, ఉక్కపోతతో భక్తులు ఇబ్బంది పడకుండా మిథిలా స్టేడియంలో ఏసీలతోపాటు 100 కూలర్లు, 270 ఫ్యాన్లు అధికారులు ఏర్పాటు చేశారు. కల్యాణ వేడుకలో భాగంగా రాత్రి ఎదుర్కోలు ఉత్సవం సంప్రదాయ బద్దంగా సాగింది. ప్రభుత్వం తరపున శాంతికుమారి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. కల్యాణ మహోత్సవం సందర్భంగా భక్తులకోసం 2లక్షల50వేల లడ్డూలను ఆలయ అధికారులు అందుబాటులో ఉంచారు.. వీటిని 19 ప్రసాద కౌంటర్ల ద్వారా విక్రయించనున్నారు. మరోవైపు మిథిలా స్టేడియంలోనే రేపు శ్రీరామ మహా పట్టాభిషేకం నిర్వహించనున్నారు. స్వామివారి కల్యాణం, పట్టాభిషేకంను తిలకించేందుకు భద్రాద్రి తరలివచ్చే భక్తులకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కల్యాణం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ ఆధ్వర్యంలో 1800మందిపైగా పోలీసులు బందోబస్తును నిర్వహిస్తున్నారు.

Also Read : TTD : తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఈనెల 18న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు

కల్యాణ మహోత్సవం జరుగుతుంది ఇలా..
కల్యాణోత్సవంలో భాగంగా.. తిరు కల్యాణానికి సంకల్పం పలికి.. సర్వవిజ్ఞాన శాంతికి విష్వక్సేనుల వారిని ఆరాధిస్తారు. పుణ్యాహ వాచనం ఉంటుంది. క్రతువుకు ఉపయోగించే సామాగ్రిని సంప్రోక్షణ చేస్తారు. రక్షాబంధనం నిర్వహిస్తారు. దర్భలతో ప్రత్యేకంగా అల్లిన తాడుని సీతమ్మవారి నడుముకి బిగిస్తారు. దీన్ని యోక్ర్తధారణగా పండితులు చెబుతున్నారు. సీతారాముల వారికి రక్షా సూత్రాలు కడుతారు. స్వామి గృహస్థాశ్రమసిద్ధి కోసం రామయ్యకు యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తారు. తాంబూలాది సత్కారాలు చేసి కన్యావరణం నిర్వహిస్తారు. శ్రీరాముడికి సీతమ్మ తగిన వధువు అని పెద్దలు నిర్ణయిస్తారు. స్వామివారి పాద ప్రక్షాళన ఉంటుంది. వధూవరులకు మంగళం చేకూర్చాలనే భావంతో అందించే ఈ ఆశీస్సులు కల్యాణం వీక్షించే భక్తులందరికీ వర్తించేలా ఉంటాయి. కల్యాణ వైభవాన్ని చాటిచెప్పేలా చూర్ణికను పఠిస్తారు. వేద మంత్రోచ్ఛారణ మార్మోగుతుండగా అభిజిత్ లగ్నం సమీపించగానే జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని సీతారాముల వారి శిరస్సుపై ఉంచుతారు. ఇది శుభ ముహూర్తం.