Srinivas Goud: మోదీ చేయాలనుకున్న ఈ కుట్ర విఫలమైంది: మంత్రి శ్రీనివాస్ గౌడ్ 

దేశంలో ఆయన చేసిన అరాచకాలు అందరికీ తెలుసని శ్రీనివాస్ గౌడ్ చెప్పారు.

Srinivas Goud: మోదీ చేయాలనుకున్న ఈ కుట్ర విఫలమైంది: మంత్రి శ్రీనివాస్ గౌడ్ 

Srinivas Goud

Updated On : July 8, 2023 / 4:03 PM IST

Srinivas Goud – Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ(Telangana)కు వస్తే ఏమైనా హమీలు ఇస్తారని అంతా ఎదురు చూశారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రధాని ఆ పని చేయకపోగా అసత్యాలు మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించారని చెప్పారు. ప్రాంతీయ పార్టీలను బలహీనం చేయాలన్న కుట్ర విఫలమైందని, మోదీ పాచికలు ఇక్కడ చెల్లవని అన్నారు.

దేశంలో ఆయన చేసిన అరాచకాలు అందరికీ తెలుసని శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. ఆ ఆటలు ఇక్కడ సాగవని అన్నారు. ప్రధాని హోదాకు తగిన వ్యాఖ్యలను మోదీ చేయలేదని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వంపై మోదీ చేసిన వ్యాఖ్యలపై శ్రీనివాస్ గౌడ్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ ఉద్యమంలో బీజేపీ పాత్ర ఏమిటని నిలదీశారు.

తెలంగాణలో అవినీతి జరుగుతోందని మోదీ అంటున్నారని, మరి అదే నిజమైతే రాష్ట్రంలో అభివృద్ధి ఇంతలా ఎలా జరుగుతుందని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అవినీతి లేకే అభివృద్ధి ఆగిపోయిందా ఏంటీ? అని ఎద్దేవా చేశారు. విభజన హామీలను బీజేపీ అమలు చేయలేదని, అది నమ్మకద్రోహం కాదా అని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు.

నమ్మక ద్రోహం చేస్తున్నది బీజేపీనా? బీఆర్ఎసా? అని అన్నారు. తెలంగాణకు ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయంటే అది ఎవరి ఘనత అని ప్రశ్నించారు. బీసీ ప్రధానమంత్రి అయితే బీసీలకు న్యాయం జరుగుతుందని భావించామని ఆ పని జరగడం లేదని అన్నారు. ఎన్నికల కోసమే ప్రధాని మాట్లాడారని, అంతేతప్ప ఇంకేమీ లేదని చెప్పారు.

KTR: ఉద్యోగం అడిగితే పకోడీలు వేసుకోవాలని అన్నారు.. ఇప్పుడేమో ఇక్కడకు వచ్చి..: కేటీఆర్