Jagga Reddy: జగ్గారెడ్డిపై ఎన్నికల సంఘం సీరియస్.. పోలీసులకు కీలక ఆదేశాలు
జగ్గారెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి జిల్లా ఎస్పీకి కీలక ఆదేశాలు ఇచ్చారు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి కుముదిని.
Jagga Reddy Representative Image (Image Credit To Original Source)
- ఓటర్ల మనోభావాలు దెబ్బతీసేలా జగ్గారెడ్డి కామెంట్స్ ఉన్నాయన్న ఎస్ఈసీ
- కేసు నమోదు చేసి నివేదిక ఇవ్వాలని ఎస్పీకి ఆదేశాలు
- బీఆర్ఎస్ దొంగ ఓట్లను ప్రశ్నించాను అన్న జగ్గారెడ్డి
Jagga Reddy: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సంగారెడ్డిలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. జగ్గారెడ్డి వ్యాఖ్యలపై రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. జగ్గారెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి జిల్లా ఎస్పీకి కీలక ఆదేశాలు ఇచ్చారు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి కుముదిని. కేసు నమోదు చేసి, రిపోర్ట్ ఇవ్వాలన్నారు. ఓటర్ల మనోభావాలు దెబ్బతీసేలా జగ్గారెడ్డి కామెంట్స్ ఉన్నాయని ఎస్ఈసీ అభిప్రాయపడింది. అలాగే జహీరాబాద్ లో బ్యాలెట్ పేపర్ చింపిన వ్యక్తిపైనా కేసు నమోదు చేయాలని ఆదేశించింది ఈసీ.
ఈసీ నోటీసులపై జగ్గారెడ్డి స్పందించారు. బీఆర్ఎస్ దొంగ ఓట్లపైనే తాను ప్రశ్నించానన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఒక్క వార్డులోనే 300 దొంగ ఓట్లు చేర్చారని, అవే ఓట్లను ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో వేయించారని ఆరోపించారు. ఈ దొంగ ఓట్లను తొలగించడంలో ఈసీ విఫలమైందన్నారు. దొంగ ఓట్లను తొలగించకుండా తిరిగి మాపైనే కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సంగారెడ్డిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హల్ చల్ చేశారు. 34వ వార్డులో పోలింగ్ బూత్ లోకి చొచ్చుకెళ్లేందుకు ఆయన ప్రయత్నించడం వివాదానికి దారితీసింది. కాంగ్రెస్ అభ్యర్థి చొక్కాను సీఐ పట్టుకున్నారంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ అభ్యర్థి రిగ్గింగ్ కు పాల్పడుతుంటే సీఐ వారికి సహకరిస్తున్నారని ఆరోపించారు. అలాగే ఆ సీఐపై మరిన్ని ఆరోపణలు చేశారు. పోలింగ్ బూత్ నుంచి సీఐ బయటకు రావాలంటూ జగ్గారెడ్డి హంగామా చేశారు. లేదంటే నేనే లోనికి వెళ్తా అంటూ హడావుడి చేశారు. పోలింగ్ బూత్ దగ్గర జగ్గారెడ్డి ఆవేశంతో ఊగిపోయారు. సర్ది చెప్పేందుకు వచ్చిన పోలీస్ ఉన్నతాధికారులతోనూ ఆయన వాగ్వాదానికి దిగారు.
Also Read: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారం మొత్తం వీటి చుట్టే తిరిగింది.. ఇలాగైతే ఎలా?
