Supreme Court: కంచ గచ్చిబౌలి చెట్ల నరికివేత వ్యవహారం.. రిజిస్ట్రార్ కు సుప్రీం కీలక ఆదేశాలు
హెచ్ సీయూ భూములపై సుప్రీంకోర్టు లో విచారణ జరిగింది.

supreme court
Supreme Court: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (HCU) కంచ గచ్చిబౌలి చెట్ల నరికివేత వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. కంచ గచ్చిబౌలి చెట్ల నరికివేత అంశాన్ని సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్ కె. పరమేశ్వర్ ప్రస్తావించారు. అయితే, సుప్రీంకోర్టు హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడీషియల్)కు కీలక ఆదేశాలు ఇచ్చింది. గురువారం మధ్యాహ్నం 3.30 గంటలలోపు సంఘటనా స్థలాన్ని సందర్శించి మధ్యంతర నివేదికను సమర్పించాలని ఆదేశించింది.
తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు గచ్చి బౌలి భూముల్లో ఎటువంటి చెట్ల నరికివేత జరగకుండా చూసుకోవాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఇదిలాఉంటే.. 400 ఎకరాల భూమి 30ఏళ్లుగా వివాదంలో ఉందని ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అలాగే హెచ్ సీయూలో ఉన్న భూమి అటవీ భూమి అని ఎటువంటి ఆధారాలు లేవని సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
హైకోర్టులో ఇదే విషయంపై విచారిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాది సింఘ్వీ సుప్రీంకోర్టుకు తెలిపారు. హైకోర్టు ముందు విచారణ కొనసాగుతుందని, ఎలాంటి స్టే ఇవ్వడం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణ మధ్యాహ్నం 3.45 గంటలకు జరుపుతామని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.