KTR: సుప్రీంకోర్టులో కేటీఆర్‌కు ఎదురుదెబ్బ.. క్వాష్ పిటిషన్ కొట్టివేత
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఫార్ములా ఈ-కారు రేసు కేసులో

KTR
KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఫార్ములా ఈ-కారు రేసు కేసులో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటీషన్ పై విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం పిటిషన్ ను తిరస్కరించింది. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.
ఫార్ములా ఈ-కారు రేసు కేసులో కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటీషన్ దాఖలు చేశారు. ఇందుకు హైకోర్టు నిరాకరించింది. క్వాష్ పిటిషన్ ను కొట్టివేసింది. హైకోర్టు ఉత్తర్వులు సవాల్ చేస్తూ కేటీఆర్ సుప్రీంకోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు చేశారు. కేటీఆర్ పిటిషన్ పై జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లే ధర్మాసనం విచారణ జరిపింది. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే, పిటిషన్ వెనక్కు తీసుకొని మళ్లీ హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఇవ్వాలని కేటీఆర్ తరపు న్యాయవాది కోర్టును కోరారు. మరోసారి హైకోర్టుకు వెళ్లే స్వేచ్ఛను ఇవ్వలేమన్న కోర్టు.. పిటిషన్ విత్ డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించింది.
కేటీఆర్ క్వాష్ పిటీషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో.. ఫార్ములా ఈ-కారు రేసు కేసులో ఏసీబీకి తదుపరి విచారణను ముమ్మరం చేసే అవకాశం లభించినట్లయింది. ఈ కేసులో కేటీఆర్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారని తేలితే ఏసీబీ అధికారులు ఆయన్ను అరెస్టు చేసే అవకాశం ఉంది. ఆ సమయంలో కేటీఆర్ మరోసారి హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఈ కేసులో ఏసీబీ విచారణకు ఓ దఫా కేటీఆర్ హాజరయ్యారు. సుమారు ఆరున్నర గంటలపాటు కేసు దర్యాప్తు అధికారి డీఎస్పీ మజీద్ ఖాన్ కేటీఆర్ ను విచారించారు. ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరు కావాలని ఏసీబీ అధికారులు సూచించిన విషయం తెలిసిందే.
మరోవైపు.. ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో ఏ-1గా ఉన్న కేటీఆర్ కు ఈడీ సమన్లు జారీ చేసింది. రేపు ఈడీ అధికారుల విచారణకు కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది. ఇప్పటికే ఈ కేసులో ఏ-2గా ఉన్న అరవింద్ కుమార్, ఏ-3గా ఉన్న బీఎల్ఎన్ రెడ్డిలను ఈడీ అధికారులు విచారించారు. వారి స్టేట్ మెంట్ ను రికార్డు చేశారు.