పార్టీలో జూనియర్లకు పెద్ద పీట.. టీకాంగ్రెస్‌లో సీనియర్ల గగ్గోలు!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నాయకుల తీరు మారే చాన్సే లేనట్టుంది. పార్టీ పరాజయం నుంచి విజయతీరాల వైపు ఎలా మళ్లించాలనే ఆలోచనే చేయడం లేదు. ఎంత సేపు వ్యక్తిగత ఆధిపత్యం గురించే ఆలోచిస్తున్నారు. ఒక్కో నాయకుడిది ఒక్కో రకం సమస్య. కొందరు తమను పట్టించుకోవడం లేదంటే.. మరి కొందరిలో మమ్మల్ని కాదని జూనియర్లకు ఎలా పెద్ద పీట వేస్తారనే అసంతృప్తి.
గత కొంతకాలంగా సర్కార్‌పై ఉద్యమ కార్యచరణ చేపట్టినా అందులోనూ ఎవరికి వారే పెత్తనం కోసం వెంపర్లాడడం పార్టీలో చర్చనీయంశం అయ్యింది. అంతే కాదు.. డీసీసీల నియామాకంలోనూ వర్గ పోరు బహిర్గతం అవుతోంది. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి పెద్ద పీట వేస్తున్నారని వీహెచ్ లాంటి నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
డీసీసీ అధ్యక్ష పదవిపై వీహెచ్ ఆగ్రహం :
మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికి అన్యాయం చేస్తున్నారని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి వర్గీయుడికి డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వడంపై వీహెచ్ అగ్గిమీద గుగ్గిలం అయిపోతున్నారు. రేవంత్‌కు పీసీసీ చీఫ్‌గా ఇవ్వొద్దని అంటుంటే… ఆయన అనుచరులకు ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. గత ఎన్నికల సందర్భంలోనూ ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇచ్చారని మండిపడుతున్నారు. గత కొద్ది రోజులుగా సంగారెడ్డి శాసనసభ్యుడు జగ్గారెడ్డి, వీహెచ్ కలసి రేవంత్‌కు పీసీసీ ఇవ్వొద్దని బహిరంగంగానే మాట్లాడుతున్నారు.
బలహీనవర్గాల వారికే పెద్ద పీట వేయాలి :
మరో వైపు తమ లాంటి సీనియర్లను కాదనీ.. వివిధ అఖిల పక్ష సమావేశాలకు సంపత్ కుమార్‌ను పంపడంపై హైదరాబాద్ పార్టీ కార్యక్రమాల్లో పొన్నం ప్రభాకర్‌ను భాగస్వామ్యం చేయడం పట్ల పార్టీలో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయాలపై బహిరంగంగా మాట్లాడుతుండడంతో పార్టీలోని ఆధిపత్య పోరు ఏ స్థాయిలో ఉందో చూసి కార్యకర్తలు ముక్కున లేసుకుంటున్నారు. బలహీనవర్గాల వారికే పెద్ద పీట వేయాలని మరో వర్గం డిమాండ్ చేస్తోంది. తాజాగా పీవీ శత జయంతి కమిటీ చైర్మన్‌గా గీతారెడ్డిని నియమించడాన్ని తప్పుపడుతున్నారు కొందరు సీనియర్లు.
భద్రాచలం ఎమ్మెల్యే విషయంలో పార్టీ తీసుకున్న నిర్ణయం స్వాగతించేలా లేదని, దళిత, గిరిజనుల పట్ల వివక్ష చూపుతున్నారని అంటున్నారు. జలదీక్ష కార్యక్రమంలో నీటి పారుదల శాఖ మంత్రిగా పని చేసిన పొన్నాల లక్ష్మయ్యకు చాన్స్ ఇవ్వకపోవడం, సమావేశాలకు పిలవకపోవడం, చాలాకాలం పార్టీకి సేవలందించిన కొమిరెడ్డి రాములు వంటి వారిపై సస్సెన్సన్ ఎత్తివేయకపోవడం లాంటి అంశాలపై ప్రశ్నిస్తున్నారు.
ఈ అంశాలన్నింటి పైనా అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, వీహెచ్ భావించారు. దీనికోసం తక్షణమే కోర్ కమీటి సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అధిక విద్యుత్ బిల్లులు, పోలీసుల అరెస్ట్ వంటి అంశాలపై ఆందోళనలతో ప్రజల్లో ఇమేజ్‌ను పెంచుకోవాల్సింది పోయి.. ఇలా అంతర్గత పోరుతో పార్టీ ప్రజలకు దగ్గరవ్వడంలో ఫెయిలవుతోందని కార్యకర్తలు అంటున్నారు.