అసెంబ్లీలో ఆసక్తికర దృశ్యం.. కేసీఆర్-రేవంత్‌ రెడ్డి షేక్‌హ్యాండ్‌.. ఆ తర్వాత ఇంటికి వెళ్లిపోయిన కేసీఆర్

మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్ రెడ్డి మృతి పట్ల శాసనసభ సంతాపం తెలిపింది.

అసెంబ్లీలో ఆసక్తికర దృశ్యం.. కేసీఆర్-రేవంత్‌ రెడ్డి షేక్‌హ్యాండ్‌.. ఆ తర్వాత ఇంటికి వెళ్లిపోయిన కేసీఆర్

Updated On : December 29, 2025 / 1:06 PM IST

Telangana Assembly: తెలంగాణ శాసనసభ, శానసమండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీకి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా రోజుల తర్వాత వచ్చారు. అయితే, ఆ కొద్దిసేపటికి ఆయన హైదరాబాద్‌లోని నందినగర్‌లోని తన ఇంటికి తిరిగి వెళ్లిపోయారు. మాజీ ఎమ్మెల్యేలు రాంరెడ్డి దామోదర్ రెడ్డి, కొండా లక్ష్మణ్ రెడ్డి మృతి పట్ల శాసనసభ సంతాపం తెలిపింది.

Also Read: తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత.. భారీగా మోహరించిన పోలీసులు

అంతకుముందు అసెంబ్లీలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అసెంబ్లీలో కేసీఆర్‌, సీఎం రేవంత్‌ రెడ్డి షేక్‌హ్యాండ్‌ ఇచ్చుకున్నారు. కేసీఆర్ దగ్గరకు వెళ్లి రేవంత్‌ రెడ్డి షేక్‌హ్యాండ్‌ ఇచ్చారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి రేవంత్‌ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ దగ్గరికి వెళ్లి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వెళ్లి షేక్‌హ్యాండ్ ఇవ్వడం గమనార్హం.

కేసీఆర్‌ను కలిసిన వారిలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభత్వ విప్‌లు బీర్ల ఐలయ్య, ఆది శ్రీనివాస్, పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సీపీఐ ఎమ్మెల్యే కునమనేని సాంబశివరావు ఉన్నారు.

అసెంబ్లీ అటెండెన్స్‌ రిజిస్ట్రర్‌లో కేసీఆర్ సంతకం చేసి వెళ్లిపోయారు. అరికపూడి గాంధీ, ప్రకాశ్‌ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి ట్రెజరీ బెంచీల వైపు కూర్చున్నారు. వీరు బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నట్లు ఇటీవల స్పీకర్ గడ్డం ప్రసాద్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కూడా ట్రెజరీ బెంచీలవైపే కూర్చున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు అక్కడ కూర్చోవడాన్ని గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తప్పుబట్టిన విషయం విదితమే.