Raja Singh : రైతు, ప్రజా సమస్యలపై అసెంబ్లీలో పోరాటం-రాజాసింగ్
బీజేపీ ఎమ్మెల్యేలు(Raja Singh) అధికార టీఆర్ఎస్ ని టార్గెట్ చేశారు. అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు రెడీ అయ్యారు.

Raja Singh
Raja Singh : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభానికి ముందే రాజకీయాల్లో హీట్ పెంచాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీజేపీ ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్ ని టార్గెట్ చేశారు. అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు రెడీ అయ్యారు. రైతు, ప్రజా సమస్యలపై అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలుగా పోరాటం చేస్తామని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పారు.
అసెంబ్లీ సాక్షిగా తండ్రీకొడుకులు అబద్ధాలు చెబుతున్నారని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై ఫైర్ అయ్యారు. కేటీఆర్ తో పాటు కేసీఆర్ కు మరో (ఓవైసీ సోదరులు) ఇద్దరు కొడుకులున్నారని రాజాసింగ్ అన్నారు. యుక్రెయిన్ లో చిక్కుకున్న తెలంగాణ వాసులను తీసుకురావటంలో కేసీఆర్ విఫలం అయ్యారని రాజాసింగ్ విమర్శించారు. కేసీఆర్ తనను తాను సింహం అనుకుంటున్నారని, బీజేపీకి కేసీఆర్ ఎలుకతో సమానం అని రాజాసింగ్ అన్నారు. తెలంగాణ… కేసీఆర్ జాగీరు కాదన్న రాజాసింగ్… కేంద్రంలో కేసీఆర్ బాప్(మోదీ) ఉన్నారని హెచ్చరించారు.
BJP Kishan Reddy : ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.. కేసీఆర్‌ను ఎవరూ కాపాడలేరు-కిషన్ రెడ్డి
ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీపైనా నిప్పులు చెరిగారు రాజాసింగ్. హైదరాబాద్ పార్లమెంట్ ను గెలిచి.. ఓవైసీని ఇంట్లో కూర్చోపెడ్తామన్నారు. పాతబస్తీని అభివృద్ధి చేయని ఓవైసీ.. యూపీలో ఏం చేస్తారని ప్రశ్నించారు. ఎంఐఎం జెండా పీకేసి.. కాషాయ జెండా ఎగురవేయటానికి ప్రతి హిందువు సిద్ధం కావాలని రాజాసింగ్ పిలుపునిచ్చారు. అసదుద్దీన్ మోసాలు ముస్లింలకు కూడా అర్థం అయ్యాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీపైనా రాజాసింగ్ ఫైర్ అయ్యారు. దేశంతో పాటు తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ఖతమైందన్నారు.
సోమవారం(మార్చి 7) నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు రెండు వారాల పాటు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొదటి రోజు బడ్జెట్ అనంతరం జరిగే బీఏసీ సమావేశంలో అసెంబ్లీ పనిదినాలపై స్పష్టత రానుంది. భారీ బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఈసారి సంక్షేమ, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది డిసెంబర్ లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉండడం, ముందస్తు ఎన్నికలకు కూడా టీఆర్ఎస్ సిద్ధమవుతోందని ప్రచారం జరుగుతుండడంతో ఈ బడ్జెట్ లో ప్రజాకర్షణ పథకాలకు అధిక నిధులు ఇవ్వొచ్చని అంచనాలు ఉన్నాయి.
తెలంగాణలో పెరిగిన ఆదాయం, జీఎస్డీపీ వృద్ధి రేటును పరిగణనలోకి తీసుకుని బడ్జెట్‌ను గతేడాది కంటే పెంచనున్నట్లు సమాచారం. వార్షిక బడ్జెట్‌ను మంత్రి హరీశ్ రావు సభలో ప్రవేశపెడతారు. ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ సర్కార్ ప్రవేశపెడుతున్న పూర్తి స్థాయి చివరి బడ్జెట్ ఇదే అవుతుంది.
ఈ బడ్జెట్‌లో దళిత బంధు పథకానికి అధికంగా నిధులు కేటాయించనున్నారు. అలాగే, తెలంగాణలో అమలవుతున్న ఆసరా పింఛన్లు, షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి, వడ్డీ లేని రుణాలు, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం వంటి వాటికి కేటాయింపులు భారీగా పెరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయా ప్రభుత్వ శాఖల నుంచి ప్రభుత్వం ప్రతిపాదనలు సేకరించి కేటాయింపులపై స్పష్టతకు వచ్చింది. గవర్నర్ తమిళిసై ప్రసంగం లేకుండానే ఈసారి బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే.
సమావేశాల సందర్భంగా అనుసరించాల్సిన అంశాలపై ఇప్పటికే స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప్రొటెం చైర్మన్ అమీనుల్ జాఫ్రీలు సమీక్ష నిర్వహించారు. ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు.
కోవిడ్ వ్యాప్తి అదుపులో ఉన్నా.. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పరంగా అధికారులు… సభ్యులు ఎలాంటి ప్రశ్నలు అడిగినా సమాచారం అందించేందుకు రెడీగా ఉండాలని సూచించారు. గతంలో జరిగిన సమావేశాలకు సంబంధించిన ప్రశ్నలను వెంటనే సభ్యులకు అందేలా చూడాలని అధికారులను స్పీకర్ ఆదేశించారు.
Telangana Budget 2022-23 : గవర్నర్ ప్రసంగం లేకుండా అసెంబ్లీ.. బీజేపీ నేతల ఆగ్రహం
శాసనసభా సమావేశాల నిర్వహణలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని స్పీకర్ ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణలో దేశంలోని ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. సభ సజావుగా నిర్వహించేందుకు అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో భద్రతా పరమైన చర్యలు కట్టుదిట్టంగా చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కోవిడ్ పరీక్షా కేంద్రాన్ని అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేయాలని.. అనుమానం ఉన్న వారికి పరీక్షలు నిర్వహించాలని సూచించారు.