YS Sharmila : షర్మిల పార్టీకి అభ్యర్థుల కొరత, ఈ దుస్థితికి కారణం అదేనా?

తెలంగాణ రాజకీయాలనే మార్చేస్తానన్న వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల పరిస్థితి ఏమంత ఆశాజనకంగా కనిపించడం లేదు. YS Sharmila

YS Sharmila : షర్మిల పార్టీకి అభ్యర్థుల కొరత, ఈ దుస్థితికి కారణం అదేనా?

YS Sharmila Hunt For MLA Candidates

YS Sharmila Hunt For MLA Candidates : ప్రధాన పార్టీలతో పోటీ పడుతూ తెలంగాణలో కాబోయే సీఎం నేనే అంటూ ప్రకటించిన వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ లో విలీనం చేసేద్దామని విశ్వప్రయత్నాలు చేశారు షర్మిల. అది సాధ్యం కాకపోవడంతో 119 నియోజకవర్గాల్లోనూ పోటీకి సై అన్నారు. ఆ తర్వాత అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించారు. అయితే, షర్మిల పార్టీ టికెట్లకు పెద్దగా స్పందన కనిపించడం లేదట. కనీసం నియోజకవర్గానికి ఒక్క దరఖాస్తు కూడా ఇప్పటివరకు అందకపోవడంతో పరువు నిలబెట్టుకునేందుకు అభ్యర్థుల వేట ప్రారంభించారని టాక్.

వచ్చింది 62 దరఖాస్తులే..
తెలంగాణ రాజకీయాలనే మార్చేస్తానన్న వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల పరిస్థితి ఏమంత ఆశాజనకంగా కనిపించడం లేదు. ఆమె పార్టీ తరపున పోటీ చేసేందుకు కేవలం 62 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నట్లు చెబుతున్నారు. ఇందులోనూ షర్మిల పోటీ చేస్తానంటున్న పాలేరు నుంచి అందిన దరఖాస్తులే 8. ఇక షర్మిల తల్లి విజయమ్మ, భర్త బ్రదర్ అనిల్ పోటీ చేస్తారనుకుంటున్న సికింద్రాబాద్ నుంచి మరో 12 దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ రెండు చోట్ల మినహాయిస్తే వైఎస్ఆర్ టీపీకి అందిన దరఖాస్తులు కేవలం 40 మాత్రమే.

Also Read : కవితకు ఆ ఇద్దరి బాధ్యతలే ఎందుకు అప్పగించారు.. ఆ ఇద్దరు నేతలు ఎవరు?

ఈ దుస్థితికి కారణం అదేనా?
తెలంగాణలో మొత్తం 119 నియోకవర్గాలు ఉండగా సగం స్థానాలకు కూడా దరఖాస్తులు అందకపోవడంతో దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటోంది వైఎస్ఆర్ టీపీ. పార్టీ ప్రకటన తర్వాత హడావుడిగా పాదయాత్ర చేసిన షర్మిల పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టకపోవడమే ఈ పరిస్థితికి కారణం అని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. తన బలమెంతో తెలుసుకోకుండా 119 నియోజకవర్గాలకు పోటీ చేస్తానని అనడంపైనా చర్చ జరుగుతోంది. వాస్తవానికి 10 నుంచి 15 స్థానాల్లో పోటీ చేద్దామని షర్మిలకు ఆ పార్టీ నేతలు ప్రతిపాదించారట. కానీ, ఈ విషయంలో నేతల సూచనలను పట్టించుకోని షర్మిల కాంగ్రెస్ లో పార్టీ విలీన ప్రక్రియ ఫెయిల్ కావడంతో ప్రస్టేషన్ లో మొత్తం 119 నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తానని ప్రకటించినట్లు చెబుతున్నారు.

తల్లి, భర్త పోటీపై సస్పెన్స్..
ఇక దరఖాస్తులు, పోటీ విషయం ఎలా ఉన్నా పార్టీలో షర్మిల ఒక్కరే పోటీకి సిద్ధంగా ఉన్నట్లు ప్రస్తుత పరిస్థితులు సూచిస్తున్నాయి. పార్టీ ఆవిర్భావమప్పుడే తాను ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు షర్మిల. ఆ తర్వాత సికింద్రాబాద్, మిర్యాలగూడ అంటూ ప్రతిపాదనలు వచ్చినా షర్మిల పాలేరుపైనే మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు. ఇక, షర్మిల భర్త బ్రదర్ అని, తల్లి విజయమ్మల పోటీ పైనా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. వీరు పోటీ చేసినా చేయకపోయినా పరిస్థితులు ఇలానే కొనసాగితే ఎన్ని చోట్ల నుంచి పోటీ చేస్తారనే దానిపైనా స్పష్టత రావడం లేదు.

Also Read : కేసీఆర్ రాకతో షబ్బీర్ అలీ వెనకడుగు.. కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి ఆయనేనా?

దరఖాస్తుల స్వీకరణకు డెడ్ లైన్ ప్రకటించనందున నామినేషన్ల గడువు పూర్తయ్యే వరకు దరఖాస్తుల స్వీకరణకు సమయం ఉందని, ఆలోగా దరఖాస్తు చేసుకున్న వారికి టికెట్లు ఇస్తామని షర్మిల పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి తెలంగాణకు కాబోయే సీఎం అంటూ రంగంలోకి దిగిన షర్మిల పార్టీ వ్యవహారం పరిశీలిస్తే అనుభవం లేకపోవడం, ఆర్బాటపు ప్రకటనలే కనిపిస్తున్నాయని అంటున్నారు విశ్లేషకులు.