తెలంగాణలో పెరిగిన ఓటు బ్యాంకు.. హ్యట్రిక్ కొట్టేందుకు వ్యూహాలు రచిస్తున్న బీజేపీ
హ్యాట్రిక్ కొట్టి కేంద్రంలో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాలు రచిస్తోంది బీజేపీ. ఇందులో తెలంగాణ ప్రజల భాగస్వామ్యం భారీగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

telangana bjp focus on lok sabha election 2024 and target double digit
Telangana BJP: ముచ్చటగా మూడోసారి దేశంలో అధికారంలోకి వచ్చేది తామేనన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు. ఈ క్రమంలోనే తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాలను లక్ష్యంగా పెట్టుకున్నారు. 12 సెగ్మెంట్లలో బలంగా ఉన్నామని చెబుతున్న కమలనాథులు.. అనుకున్న టార్గెట్‌ను చేరేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. రాష్ట్రంలో గత ఎన్నికల్లో పెరిగిన ఓటు బ్యాంకుకు తోడు.. మోదీ చరిష్మా, అయోధ్య రామాలయం మరింతగా కలిసి వస్తాయిని భావిస్తున్నారు.
12 పార్లమెంట్ సెగ్మెంట్లలో బలంగా బీజేపీ
హ్యాట్రిక్ కొట్టి కేంద్రంలో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాలు రచిస్తోంది బీజేపీ. ఇందులో తెలంగాణ ప్రజల భాగస్వామ్యం భారీగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలోని 12 పార్లమెంట్ సెగ్మెంట్లలో బీజేపీ బలంగా ఉందని.. ఇందులో 10 సీట్లు కచ్చితంగా గెలుస్తామన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. సిట్టింగ్ స్థానాలైన సికింద్రాబాద్, నిజామాబాద్, కరీంనగర్ మినహా అన్ని స్థానాల్లో టికెట్ ఆశించే వారి సంఖ్య భారీగానే ఉంది. ఇక ఆదిలాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావు ఉన్నా.. అక్కడ ముగ్గురి నుంచి నలుగురు టికెట్ ఆశిస్తున్నారు. ఇక పార్టీ ఏమాత్రం బలంగా లేని నల్గొండ, ఖమ్మం పార్లమెంట్ స్థానాల్లో సైతం అరడజను మంది నేతలు టికెట్లు ఆశిస్తున్నారు.
చిన్న ఓటు కాంగ్రెస్‌కు, పెద్ద ఓటు మోదీకి
అయితే వీరంతా టికెట్ ఆశించడానికి చాలా కారణాలున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు తేడా ఉంటుందని.. లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్రమోదీకి ఓటేసేందుకు ప్రజలు డిసైడ్ అయ్యారని బీజేపీ అగ్రనేతలు పదేపదే చెబుతున్నారు. ఇక రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అయితే.. చిన్న ఓటు కాంగ్రెస్‌కు వేశాం, పెద్ద ఓటు మోదీకి వేస్తామని ప్రజలు చెబుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో బీజేపీ ప్రజలకు ఏదో చేస్తుందని కాకుండా.. ప్రధాని నరేంద్రమోదీని చూసి ఓట్లు వేస్తారని నమ్ముతున్నారు బీజేపీ నాయకులు. ఈక్రమంలోనే బీజేపీ నుంచి బీఫామ్ దక్కితే చాలు.. ఎంపీగా గెలిచినట్లేనని ఫీల్ అవుతున్నారు.
ఇటు మోదీ, అటు అయోధ్య..
మరోవైపు.. జనవరి 22న అయోధ్యలో రామయ్య ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. వందల ఏళ్లనాటి హిందువుల కల నెరవేరుతున్న వేళ.. తమకు కలిసి వచ్చే అంశంగా మారుతుందని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీతోపాటు, బీజేపీకి ప్రజలు పట్టం కడతారని అంచనా వేస్తున్నారు. ఇటు మోదీ, అటు అయోధ్య.. రెండు అంశాలే తమను గెలిపిస్తాయని భావించడంతో.. ప్రతి నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించే వారి జాబితా భారీగా ఉంటోంది. కానీ.. ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ అధిష్టానం మాత్రం.. ప్రజల్లో ఆదరాభిమానాలు ఉన్న వ్యక్తులనే రంగంలోకి దింపే యోచన చేస్తోంది.
Also Read: బీఆర్ఎస్‌కు కొత్త టెన్షన్.. ఆ నలుగురు ప్రజాప్రతినిధులకు అవిశ్వాస గండం
మరోవైపు.. మోదీ చరిష్మా తమను గెలిపిస్తుందని రాష్ట్ర నేతలు భావిస్తే.. మొదటికే మోసం వచ్చే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కిందిస్థాయి కార్యకర్తలు. గత ఎన్నికల్లో కాకుండా.. నేతలందరినీ కలుపుకొని పోతేనే రామ మందిరం అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లగలమని చెబుతున్నారు. ఇదే సమయంలో మూడోసారి మోదీ ప్రధాని అయితే.. దేశానికి జరిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం కూడా ఉందంటున్నారు కొందరు నేతలు.