నేడు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ.. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోయేది వీరే..
మంత్రివర్గంలో కొత్తగా చేరే ముగ్గురు పేర్లు ఖరారు కావటంతో ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.20 గంటల మధ్య వీరి ప్రమాణ స్వీకారం జరగనుంది.

Telangana Cabinet expansion: కొద్ది నెలలుగా ఎప్పుడెప్పుడా అని ఎరుచూస్తున్న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైంది. మంత్రి వర్గ విస్తరణలో ముగ్గురు ఎమ్మెల్యేలకు చోటు కల్పిస్తూ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. బీసీ సామాజిక వర్గం నుంచి వి. శ్రీహరి ముదిరాజ్, ఎస్సీ మాల సామాజిక వర్గం నుంచి గడ్డం వివేక్ వెంకట స్వామి, మాదిగ సామాజిక వర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లు కొత్తగా మంత్రివర్గంలోకి చేరడం ఖాయమైంది.
మంత్రివర్గంలో కొత్తగా చేరే ముగ్గురు పేర్లు ఖరారు కావటంతో ఇవాళ రాజ్ భవన్ లో మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.20 గంటల మధ్య వీరి ప్రమాణ స్వీకారం జరగనుంది. అయితే, మంత్రివర్గ విస్తరణలో సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలకు చోటు దక్కడం ఖాయమని కాంగ్రెస్ వర్గాల్లో విస్తృత ప్రచారం జరిగింది. కానీ, కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం కేవలం బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకు మాత్రమే ప్రస్తుతం అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకోవటంతో వారికి అవకాశం దక్కలేదని తెలుస్తోంది. అయితే, సుందర్శన్ రెడ్డికి కూడా మంత్రివర్గ విస్తరణలో భాగంగా అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుపడుతున్నట్లు సమాచారం.
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ గత నాలుగు రోజులుగా హైదరాబాద్ లోనే ఉంటున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో విస్తృతంగా చర్చించిన నేపథ్యంలో సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని మంత్రివర్గ విస్తరణ ఉండాలని అధిష్టానానికి సూచించినట్లు సమాచారం.