Traffic Bureau: త్వరలో ‘ట్రాఫిక్ బ్యూరో’.. సీఎం రేవంత్ ఆదేశాలతో డీజీపీ కీలక ప్రకటన.. ఇక ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్..!
ట్రాఫిక్ అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి తక్షణ నిర్ణయాలు తీసుకోవాలన్నారు. శాంతిభద్రతల విభాగం కూడా ట్రాఫిక్ నియంత్రణలో భాగస్వామ్యం అవ్వాలని ఆదేశించారు.
Traffic Bureau: సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన పర్యటనల సమయంలో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూసుకోనున్నారు. ఈ మేరకు ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలని డీజీపీని ఆదేశించారు. ప్రజలను గంటల తరబడి రోడ్లపై నిలిపివేయొద్దని డీజీపీ సీవీ ఆనంద్కు సీఎం సూచించారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా ఎయిర్పోర్టు వద్ద ట్రాఫిక్ జామ్ పై ముఖ్యమంత్రి రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాన్వాయ్ కోసం ప్రజల పనులకు ఆటంకం కలిగించొద్దని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఎదురుగా వచ్చే వాహనాలను కూడా ఆపి ఇబ్బంది పెట్టొద్దని సూచించారు. నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.
రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు డీజీపీ ఆనంద్. ట్రాఫిక్ సమస్యలపై క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం త్వరలో ‘ట్రాఫిక్ బ్యూరో’ ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ ప్రకటించారు. కాన్వాయ్ వెళ్లే సమయంలో ట్రాఫిక్ పూర్తిగా ఆపకుండా సింగిల్ లైన్లో వాహనాలు పంపే ప్రణాళిక రూపొందిస్తున్నారు. రద్దీ సమయంలో ప్రత్యామ్నాయ మార్గాలు ముందుగానే సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఎయిర్పోర్టు పరిసరాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు.
వర్షా కాలం ముందు నీరు నిలిచే ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ నివారణ చర్యలు చేపట్టాలన్నారు. ట్రాఫిక్ అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి తక్షణ నిర్ణయాలు తీసుకోవాలన్నారు. సిబ్బందిలో ఆత్మవిశ్వాసం పెంపొందించాలని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డుపై అక్రమ పార్కింగ్ నివారణపై దృష్టి పెట్టాలన్నారు. ఐఎస్డబ్ల్యూ, సీఎస్డబ్ల్యూ విభాగాలతో సమన్వయం చేసుకోవాలని డీజీపీ చెప్పారు. శాంతిభద్రతల విభాగం కూడా ట్రాఫిక్ నియంత్రణలో భాగస్వామ్యం అవ్వాలని ఆదేశించారు డీజీపీ సీవీ ఆనంద్.
