Samaikyatha Dinotsavam : నేడు సమైక్యత దినోత్సవం జరుపనున్న తెలంగాణ ప్రభుత్వం.. నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్
నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో సీఎం కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం గౌరవ వందనం స్వీకరించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

Samaikyatha Dinotsavam
Telangana Government – Samaikyatha Dinotsavam : సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సమైక్యత దినోత్సవంగా పేరిట వేడుకలకు సిద్ధమైంది. సమైక్యత దినోత్సవం రోజున అన్ని జల్లాల కేంద్రాలతోపాటు ప్రభుత్వ కార్యాలయాల్లో వేడుకలు జరపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఆదేశాలిచ్చారు. నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో సీఎం కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.
గతేడాది కూడా తెలంగాణ సమైక్యత వజ్రోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. మూడు రోజులపాటు ర్యాలీలు నిర్వహించడంతోపాటు వాడ వాడలా జాతీయ జెండాను ఎగుర వేసింది. ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. సమైక్యత వేడుకల్లో భాగంగా జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ప్రజా ప్రతినిధులు జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు.
అనంతరం గౌరవ వందనం స్వీకరించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. తెలంగాణ అమర వీరులకు నివాళులర్పించి ఆనాటి పోరాట వీరులను సన్మానించనున్నారు. అంతకంటే ముందే అన్ని జిల్లాల కలెక్టర్లతోపాటు ఎస్పీ కార్యాలయాలు ఇతర అన్ని స్థాయిల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ జాతీయ జెండాను ఎగరవేసి సమైక్యత దినోత్సవాన్ని జరుపుకోనున్నారు.
మరోవైపు సమైక్యత వేడుకల్లో బీఆర్ఎస్ శ్రేణులంతా పాల్గొనాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. వేడుకలు జరిగే ప్రాంతాల్లో ప్రజా ప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు అభిమానులు ఎక్కడికక్కడ భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు.