తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రాష్ట్రంలో భూసర్వే.. మీ పొలాలకు గట్టు పంచాయతీలున్నాయా..?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఊరూరా గెట్టు పంచాయితీలకు చెక్ పెట్టేందుకు సిద్ధమవుతోంది. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత ..

CM Revanth Reddy
Telangana Govt: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఊరూరా గెట్టు పంచాయితీలకు చెక్ పెట్టేందుకు సిద్ధమవుతోంది. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత గత ప్రభుత్వం హయాంలో ఉన్న ధరణి పోర్టల్ ను తీసేసి దానిస్థానంలో భూభారతి చట్టంను అమల్లోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది. వాస్తవానికి భూ భారతి చట్టం ప్రకారం భూముల అమ్మకాలు, కొనుగోళ్ల సమయంలో సర్వే మ్యాప్ తప్పనిసరి. ఈ మేరకు గైడ్ లైన్స్ రూపొందిస్తున్న ప్రభుత్వం.. తాజాగా సర్వే మ్యాప్ లపై దృష్టిసారించింది.
భూభారతి చట్టంతో ఊరూరా గెట్ల పంచాయితీకి చెక్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని వ్యవసాయ భూములన్నింటినీ సర్వే చేసి, ప్రతి సర్వే నెంబర్ లో బై నెంబర్ల వారీగా మ్యాప్ లు రెడీ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా భూములను సర్వే చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతి మండలానికి ఒక డిజిటల్ సర్వే పరికరం కొనుగోలు చేసేందుకు సర్కార్ సిద్ధమైంది. ఇందుకోసం త్వరలోనే టెండర్లు పిలవనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా భూములను సర్వే చేయాలంటే ప్రతి మండలానికి ఒక సర్వేయర్, డిప్యూటీ సర్వేయర్ ఉండాలి. అయితే, ప్రస్తుతం చాలా మండలాల్లో పూర్తిస్థాయి సర్వేయర్, డిప్యూటీ సర్వేర్లు లేరు. దీంతో రాష్ట్రంలో 570 మండలాలు ఉండగా.. అన్ని మండలాల్లో సర్వేయర్లను నియమించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగా.. రాష్ట్ర వ్యాప్తంగా పాత వీఆర్వోలను తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకొని వారికి ట్రైనింగ్ ఇచ్చి సర్వేయర్ పోస్టులను భర్తీ చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
రాబోయే పది రోజుల్లో భూభారతి రూల్స్ ఫైనల్ చేసి చట్టం అమల్లోకి తెచ్చినా సర్వే మ్యాప్ కు కొంత సమయం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకోసం ఆరు నుంచి 8 నెలలు సమయం పట్టే అవకాశం ఉంది. భూ యాజమాని సమక్షంలోనే డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (డీజీపీఎస్) సర్వే చేస్తే ప్రజల మద్దతు కూడా లభిస్తుందని భావిస్తున్న ప్రభుత్వం.. ఇందుకోసం సాంకేతిక యంత్రాలు, మానవ వనరులు, తదితర ఖర్చులు కలుపుకొని రూ.600 కోట్ల నుంచి రూ. 700 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తుంది.
భూభారతి చట్టంలో ఏ సర్వే నెంబర్లోని భూమిని విక్రయిస్తున్నారో.. దానికి సంబంధించిన మ్యాప్ ను పూర్తిస్థాయిలో సమర్పించేలా నిబంధన తెచ్చారు. ఈ క్రమంలో ఎవరికి వాళ్లకు సర్వే నిర్వహించుకునేందుకు అవకాశం ఇస్తే మరిన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రభుత్వమే సర్వేచేసి మ్యాప్ లను ఇచ్చి డిజిటల్ కోఆర్డినేట్స్ పిక్స్ చేస్తే భవిష్యత్తులో ఎప్పటికీ ఇబ్బంది రాదని ప్రభుత్వం భావిస్తుంది. అయితే, సర్వేలో భాగంగా ముందు ప్రభుత్వ, ఎండోమెంట్ భూములను సర్వే చేసి సరిహద్దులను గుర్తించాలని, ఆ తరువాత రైతుల భూములను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.