Telangana Government : రూ.50 వేల లోపు రైతు రుణమాఫీకి మార్గదర్శకాలు విడుదల
తెలంగాణలో 50 వేల రూపాయల లోపు రైతు రుణమాఫీకి మార్గదర్శకాలు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఈ నెల 16 నుంచి రైతుల ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు జమకానున్నాయి.

Waiver Of Farmer Loan
waiver of farmer loan : తెలంగాణలో 50 వేల రూపాయల లోపు రైతు రుణమాఫీకి మార్గదర్శకాలు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఈ నెల 16 నుంచి రైతుల ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు జమకానున్నాయి. రుణమాఫీకి సంబంధించి ఇక్కట్లు లేకుండా చూడాలని బ్యాంకర్లను మంత్రులు హరీష్‌రావు, నిరంజన్‌రెడ్డి ఆదేశించారు.
రైతు రుణమాఫీకి పథకానికి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే 25 వేల లోపు ఉన్న రుణాలకు సంబంధించి మాఫీ చేసిన ప్రభుత్వం.. 50 వేల రూపాయల లోపు రైతు రుణ మాఫీపై జీవో ఇచ్చింది. 2018లో ప్రకటించిన రైతు రుణమాఫీ పథకానికి సంబంధించి ఈ మార్గదర్శకాలున్నాయి. అంటే 2018 నుంచి రుణమాఫీ అమల్లోకి రానుంది. 50 వేల లోపు రుణమాఫీ అమలుకోసం 18 వందల 50 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది.
రుణమాఫీ ఏర్పాట్లు, అమలుపై ఆర్థికమంత్రి హరీశ్‌రావు, వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి…బ్యాంకర్లతో సమీక్ష నిర్వహించారు. బీఆర్‌కే భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో 42 బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు. 50 వేల రూపాయల లోపు రుణమాఫీపై సీఎం కేసీఆర్ ఈ నెల 15న ప్రకటన చేయనున్నారని బ్యాంకర్లకు మంత్రులు తెలిపారు.
ఈ నెల 16 నుంచి రైతుల ఖాతాల్లో 50 వేల లోపు రుణాలను ప్రభుత్వం మాఫీ చేయనుంది. ఈ కోటాలో రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల మంది రైతులు ఉన్నారు. వీరికి సంబంధించి మొత్తం 2006 కోట్ల రూపాయల రుణమాఫీ మొత్తం జమ చేయనుంది. ఆయా రైతు అకౌంట్లలో డబ్బులు జమ చేయడంపై బ్యాంకర్లతో మంత్రులు చర్చించారు. రుణ మాఫీ మొత్తాన్ని ఏ ఇతర ఖాతా కింద జమ చేయవద్దని, పూర్తిగా రుణ మాఫీ ఖాతాలోనే జమ చేయాలని బ్యాంకర్లను ఆదేశించారు. రుణ మాఫీ జరిగిన రైతుల అక్కౌంట్లను జీరో చేసి కొత్తగా పంట రుణాలు ఇవ్వాలని మంత్రులు సూచించారు.
రుణమాఫీ మొత్తం జమ అవగానే ముఖ్యమంత్రి పేరుతో రైతు రుణం మాఫీ అయినట్లు లబ్ధిదారుల ఫోన్లకు ఎస్.ఎం.ఎస్ వెళ్లాలని మంత్రి హరీశ్ రావు …బ్యాంకర్లను ఆదేశించారు. కొత్త పంట రుణానికి మీరు అర్హులని ఆ సందేశంలో తప్పకుండా ఉండాలన్నారు. రుణమాఫీ చెల్లింపుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడడంతో పాటు ప్రభుత్వానికి బ్యాంకులు సహకరించాలన్నారు.