మరోసాయం : యాసంగి నిధుల పంపిణీ..రైతు బ్యాంకుల ఖాతాల్లో డబ్బులు

telangana rythu bandhu : తెలంగాణలో మరోదఫా రైతుబంధు నిధుల పంపిణీకి రంగం సిద్ధమైంది. ఈ యాసంగిలో కూడా ఎకరాకు రెండో దఫా నిధుల కింద ఐదు వేల రూపాయల చొప్పున రైతు ఖాతాలో జమ చేయబోతున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ వ్యవసాయ, బ్యాంకు అధికారులతో ఇప్పటికే సమీక్షలు నిర్వహించారు. రైతు బంధుపథకం లబ్ధిదారులకు అందే డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది.
ఈ యాసంగీ పంట పెట్టుబడి సాయం కింద 5 వేల రూపాయల చొప్పున మొత్తం 58 లక్షలకు పైగా మంది రైతులకు రైతు బంధు పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. 2018-19 లో ఏటా 12 వేల కోట్ల రూపాయలుగా ఉన్న బడ్జెట్ ను ఈ ఏడాది 14 వేల కోట్లకు పెంచారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు, వారికి అండగా ఉండేందుకు పెట్టుబడి సాయం కోసం రైతుబంధు పథకాన్ని తీసుకువచ్చింది. 2018లో ప్రారంభించిన ఈ పథకం నిరంతరంగా కొనసాగుతోంది. మొదట ఎకరాకు 8 వేల రూపాయల చొప్పున రెండు దఫాలుగా పంపిణీ చేసిన సర్కార్..తర్వాత ఈ మొత్తాన్ని 10 వేలకు పెంచింది.
వర్షాకాలంలో 5 వేలు, యాసంగిలో మరో 5 వేల చొప్పున పంపిణీ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 58 లక్షల 33 వేల మంది రైతులు రైతు బంధు పథకం కింద లబ్ధి పొందుతున్నారు. మొత్తానికి రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో రాబడి ఆదాయం లేకపోయినా..తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా రెండో విడత రైతుబంధు సాయాన్ని పంపిణీ చేయబోతోంది.