Bhoiguda Fire Accident: బోయిగూడ అగ్నిప్రమాద ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దిగ్బ్రాంతి
మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరుపున రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఘోర అగ్నిప్రమాదంలో 11 మంది వలస కార్మికులు మృతి చెందారు

Bhoiguda Fire Accident:
Bhoiguda Fire Accident:: బుధవారం తెల్లవారుజామున సికింద్రాబాద్ బోయిగూడలోని ఓ టింబర్ దుకాణంలో చోటుచేసుకున్న ఘోర అగ్నిప్రమాదంలో 11 మంది వలస కార్మికులు మృతి చెందారు. స్క్రాప్ గోడౌన్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలు.. పక్కనే ఉన్న టింబర్ దుకాణానికి ఎగబాకడంతో అక్కడ నిద్రిస్తున్న కార్మికులు సజీవ దహనం అయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు మంటలను అదుపుచేసి మృతదేహాలను వెలికితీశారు. మృతులంతా బీహార్ నుంచి వచ్చిన వలస కార్మికులుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ స్పందిస్తూ ప్రమాదంలో వలస కార్మికులు మృతి చెందడం బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరుపున రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. మృతదేహాలను స్వగ్రామాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని సోమేశ్ కుమార్ తెలిపారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం అవసరమైన చర్యలు చేపడుతున్నామని ఆయన అన్నారు.
Also read:TS High Court : తెలంగాణ హైకోర్టుకు 10మంది కొత్త న్యాయమూర్తులు..నలుగురు మహిళలకు స్థానం
సానుభూతి తెలిపిన బండి సంజయ్:
బోయిగూడ అగ్నిప్రమాద ప్రాంతాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పరిశీలించారు. ఈసందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ అగ్ని ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, 11 మంది పేద కార్మికులు సజీవదహనమవడం కలచివేసిందని అన్నారు. మృతులంతా బీహార్ వాసులని తెలిసిందని పొట్టకూటి కోసం వచ్చి ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని బండి సంజయ్ అన్నారు. మృతుల కుటుంబాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని సంజయ్ విజ్ఞప్తి చేశారు. అనుమతుల నుండి ఫైర్ సేఫ్ట్టీ చర్యల దాకా అధికారుల్లో నెలకొన్న నిర్లక్ష్యం, పర్యవేక్షణాలోపమే ఇలాంటి ప్రమాదాలకు కారణం అవుతుందని..భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావ్రుతం కాకుండా చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ అధికారులకు సూచించారు.
Also Read:Disha Patrolling Vehicles: మహిళల రక్షణ నిమిత్తం మరో 163 దిశ పాట్రోలింగ్ వాహనాలు అందుబాటులోకి
సోదరుడిని కోల్పోయిన బాధితుడు:
కాగా, బుధవారం తెల్లవారు జామున జరిగిన ఈ ఘోర అగ్నిప్రమాదంలో తొలుత ఐదుగురు మృతి చెందినట్లు నిర్ధారించగా అనంతరం 11 మంది మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు. ఈప్రమాదం నుంచి ఒక్క యువకుడు బయటపడ్డాడు. అయితే ప్రమాదంలో తన సోదరుడిని కోల్పోయానని యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తన సోదరుడు దామోదర్ ఆరు సంవత్సరాలుగా స్క్రాప్ దుకాణంలో పనిచేస్తున్నాడని..ప్రతి నెలా 12 వేల రూపాయలు ఇంటికి పంపిస్తాడని..ఈ ప్రమాదంలో దామోదర్ మృతి చెందడం తమ కుటుంబంలో తీరని విషాదం నింపిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు పోలీసులు సమాచారం అందించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.