TS HD Srinivasa Rao : తాయత్తు మహిమ వల్లే బతికా.. డాక్టర్లు చేయలేనిది తాయత్తు బతికించింది : తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు
డాక్టర్లు చేయలేని పని తాయత్తు మహిమ వల్ల నేను బతికాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు.

TS HD Srinivasa Rao
TS HD Srinivasa Rao : సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లోకి వచ్చారు. కొత్తగూడెం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటూ తన రాజకీయ అరంగ్రేటం గురించి వెల్లడించిన శ్రీనివాసరావు కొత్తగూడెంలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న సందర్భంగా తాయత్తు మహిమ వల్లే తాను బతికానని తాయత్తు మహిమతోనే ఈ స్థాయిలో ఉన్నానంటూ డాక్టర్లు చేయలేని పని తాయత్తు మహిమ నన్ను బతికింది అంటూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నప్పుడు తనకు అనారోగ్యం చేసినప్పుడు తనకు ఎంత వైద్యం చేయించినా కుదుట పడలేదని తాయత్తు కడితేనే బతికానని చెప్పుకొచ్చారు శ్రీనివాసరావు. దీంతో రాష్ట్రానికి హెల్త్ డైరెక్టర్ గా ఉంటు మూఢనమ్మకాలను పెంచి పోషిస్తున్నట్లుగా ఇటువంటి వ్యాఖ్యలు చేయటమేంటీ అంటూ విమర్శలు వెల్లువెత్తున్నాయి.
గతంలో హెల్త్ డైరెక్ట్ హోదాలో ఉండి క్షుద్రపూజలు చేసినట్టుగా ఆరోపణలు వచ్చాయి. అలాగే కరోనా సమయంలో అందరు మాస్కులు పెట్టుకోవాలని సూచించి ఆయన మాత్రం మాస్కు ధరించకుండా జనంతో కలిసి డ్యాన్సులు వేయటం,యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దయతో మనం కరోనా నుంచి విముక్తి పొందామని చెప్పటం,ఏసుక్రీస్తు దయతో మనం కరోనా నుంచి విముక్తి పొందామని అనటం ఇటువంటి వ్యాఖ్యలు, చర్యలతో వివాదాల్లో నిలుస్తుంటారు శ్రీనివాసరావు.
తాజాగా కొత్తగూడెం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పిన మరునాడే కొత్తగూడెంలో ముస్లింలకు తాను నిర్వహించే జీఎస్ఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఇస్తూ తాను చిన్నప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉండా డాక్టర్లు వైద్యం చేసినా ఫలితం లేకపోతే అప్పుడు తన తాత, అమ్మమ్మలు దగ్గర్లో మసీదుకు తీసుకెళ్లి తాయత్తు కట్టించారని… ఆ తాయత్తు మహిమ వల్లే తాను ప్రాణాలతో ఉన్నానని..ఆ తాయత్తు మహిమ వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నానని చెప్పుకొచ్చారు. హెల్త్ డైరెక్టర్ గా ఉండి ఇటువంటి వ్యాఖ్యలు చేయటంతో విమర్శలు వస్తున్నాయి.