TS Health Director : తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు పొలిటికల్ ఎంట్రీ .. పోటీ అక్కడనుంచే నంటున్న డాక్టర్
25 ఏళ్లుగా వైద్య ఆరోగ్య శాఖలో సేవలు అందిస్తున్నా,ఇప్పటి వరకు రోగులకు సేవ చేసిన నేను ఇకపై ప్రజలకు నేరుగా సేవ చేయాలనుకుంటున్నా. ప్రజా సేవ చేయడమే నిజమైన రాజకీయం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు.

Ts Health Director Political Entry
TS Health Director : వివాదాస్పద వ్యాఖ్యలు, చర్యలతో వార్తల్లో నిలిచే తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు పొలిటికల్ ఎంట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ అరంగ్రేటంపై క్లారిటీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ తనకు ఆదర్శమని చెబుతు కేసీఆర్ ఆదేశిస్తే తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటూ చెప్పుకొచ్చారు. డీ శ్రీనివాసరావు రాజకీయాల్లోకి వస్తారంటూ గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. ఈక్రమంలో ఆయన పొలిటికల్ ఎంట్రీపై చేసిన వ్యాఖ్యలు..ఎక్కడనుంచి పోటీకి సై అంటున్నారో ఇచ్చిన క్లారిటీ ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం డాక్టర్‌గా పేషెంట్లకు సేవలందిస్తున్నానని.. ఇకపై సీఎం కేసీఆర్ ఆదేశిస్తే కొత్తగూడెం ప్రజలు ఆశీర్వదిస్తే ఇచ్చే ఎన్నికల్లోనే ఎమ్మెల్యేగా పోటీచేస్తానని తెలిపారు. ఇప్పటి వరకు రోగులకు సేవ చేసిన తాను ఇకపై ప్రజలకు నేరుగా సేవ చేయాలనుకుంటున్నానని తెలిపారు శ్రీనివాసరావు. ప్రజా సేవ చేయడమే నిజమైన రాజకీయమనిన్నారు. కేసీఆర్ ఆదేశిస్తే..కొత్తగూడెం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని తెలిపారు. కొత్తగూడెం ప్రజలు ఆశీర్వదిస్తే వచ్చే ఎన్నికల్లో కొత్తగూడెంలో పోటీ చేస్తానని తెలిపారు.
ఈ సందర్భంగా శ్రీనివాసరావు కొత్తగూడెం బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావుపై సెటైర్లు వేశారు. కొత్తగూడెంలో అభివృద్ధి ఎలా ఉందో చూశానని అక్కడ ఏమాత్రం అభివృద్ధి చేయలేదంటూ స్థానిక ఎమ్మెల్యే వనమాపై విమర్శలు చేశారు. కొత్తగూడాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతో ఉందని అందుకే నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని తెలిపారు. కొత్తగూడానికి ఎంతో కొంత తిరిగి ఇచ్చేస్తానని అన్నారు. కొత్తగూడెం నుంచి చాలా మంది చాలా తీసుకున్నారని.. వాళ్లందరూ కొత్తగూడెంకు తిరిగి ఇచ్చేయ్యాలని సినిమా డైలాగ్ వేశారు. 25 ఏళ్లుగా వైద్య ఆరోగ్య శాఖలో సేవలు అందిస్తున్నానని కోవిడ్ సమయంలో నేను చేసిన సేవలు సీఎం కేసీఆర్ చూశారని అన్నారు. కొత్తగూడెంలో జేఎస్ ఆర్ ట్రస్ట్ పేరుతో సేవలందిస్తున్నానని తెలిపారు.
కాగా..ప్రగతిభవన్ నుంచి సీఎం కేసీఆర్ వర్చువల్ ద్వారా రాష్ట్రంలో ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీలను ప్రారంభించిన సమయంలో డీహెచ్ శ్రీనివాస రావు సీఎం కేసీఆర్ కాళ్లకు మొక్కారు. దీనిపై ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. అప్పటినుంచి శ్రీనివాసరావు రాజకీయాల్లోకి వస్తున్నారని టికెట్ కోసమే కేసీఆర్ కాళ్లకు మొక్కారని విమర్శలు వచ్చాయి. అలా వచ్చిన వార్తలు కాస్తా శ్రీనివాసరావు ఇచ్చిన పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వనమా వెంటకేశ్వరరావు పరిస్థితి ఏంటో అనే విషయంపై ఆసక్తిగా మారింది. మరి గులాబీ బాస్ శ్రీనివాసరావుకి కొత్త గూడెం సీటు ఇస్తారా? లేదా వనమాకే ఇస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.
కాగా..కొత్తగూడెంలోని సుజాతనగర్ మండలం సింగభూపాలెంలో కొత్త దేవత వెలిసిన సంగతి తెలిసిందే. దేవత అవతారంలో సుజాతనగర్ ఎంపీపీ భూక్యా విజయలక్ష్మి ప్రత్యక్ష్యమయ్యారు. ప్రత్వంగిర మాత అనే కొత్త దేవత అవతారంలో ఎంపీపీ విజయలక్ష్మి దర్శనమిచ్చారు. దీంతో కొత్త దేవతకు ఎండు మిరపకాయలతో హోమాన్ని భక్తులు నిర్వహించారు. ఈ హోమంలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నడం వివాదంగా మారింది.
అలాగే యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దయతో మనం కరోనా నుంచి విముక్తి పొందామని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు గడల శ్రీనివాసరావు అన్నారు. ఆయన రెండు రోజుల క్రితం కరోనా గురించి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన విషయం తెలిసిందే. ఏసుక్రీస్తు దయతో మనం కరోనా నుంచి విముక్తి పొందామని ఇటీవల గడల అనడంతో ఆయనను సస్పెండ్ చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది. ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు, చర్యలతో వార్తల్లో నిలిచే హెల్త్ డైరెక్టర్ పొలిటికల్ ఎంట్రీ ఆసక్తికరంగా మారింది.