Janasena : జనసేన పార్టీకి బిగ్ షాక్.. హౌజ్ మోషన్ పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు..
Janasena : జనసేన పార్టీకి హైకోర్టులో చుక్కెదురైంది. హైదరాబాద్ లో సభ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కోరుతూ జనసేన పార్టీ హైకోర్టును ఆశ్రయించగా.. పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.
Telangana High Court
Janasena : జనసేన పార్టీకి హైకోర్టులో చుక్కెదురైంది. హైదరాబాద్‌లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ‘నవ నిర్మాణ సభ’ నిర్వహించేందుకు తెలంగాణ పోలీసులు అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో ఆ పార్టీ నేతలు సభకు అనుమతి కావాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ మధ్యాహ్నం విచారణకు వచ్చింది. ఈ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈసభలో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరు కావాల్సి ఉంది. సభ నిర్వహణ కోసం సైబరాబాద్ పోలీసులకు జనసేన పార్టీ దరఖాస్తు చేసుకోగా.. పోలీసులు అందుకు నిరాకరించారు.
పోలీసుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జనసేన పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం కోర్టుకు వేసవి సెలవులు ఉన్న నేపథ్యంలో ఈ అత్యవసర పిటిషన్‌ను పరిశీలించిన రిజిస్ట్రీ.. హౌస్ మోషన్ పిటిషన్ కింద విచారించాల్సిన తీవ్రత ఇందులో లేదని పేర్కొంటూ విచారణను తిరస్కరించారు. హైకోర్టు తాజా నిర్ణయంపై జనసేన అధిష్టానం ఎలా ముందుకెళ్తుందనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.
మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ సాయంత్రం మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల సమయంలో జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలోనే మీడియా సమావేశం నిర్వహిస్తానని పవన్ కల్యాణ్ ట్విటర్ వేదికగా ప్రకటించారు. అయితే, మీడియా సమావేశంకైనా అనుమతి ఇస్తారా? అంటూ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ మీడియా సమావేశం జరుగుతుందా..? అనే అంశంపైనా చర్చ జరుగుతుంది.
మరోవైపు.. గన్‌పార్క్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఆవిర్భావ వేడుకల నేపథ్యంలో గన్‌పార్క్ వద్ద నివాళులర్పిస్తుండగా.. కాంగ్రెస్, జనసేన నేతల మధ్య ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఇరు పార్టీల నాయకుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. పవన్ సభకు అనుమతి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ జనసేన నేతలు ఆందోళనకు దిగారు. దీంతో తెలంగాణ జనసేన అధ్యక్షుడు శంకర్ గౌడ్, ఆ పార్టీ నేతలను కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. ఈ సమయంలో ఇరువైపుల నేతల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది.
