Intermediate Practicals : ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఇక ఆ కాలేజీల గుర్తింపు కష్టమే..
Intermediate Practicals : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరంలోనూ ప్రాక్టికల్స్ పెట్టాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ విద్యా సంవత్సరం నుంచే అన్ని కాలేజీల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరంలోనూ ప్రాక్టికల్స్‌ను తప్పనిసరి చేస్తోంది.
Telangana Intermediate Board Key decision.. Practicals for Inter first year students from this year
- తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం
- ఈ ఏడాది నుంచే ఫస్టియర్ విద్యార్థులకు ప్రాక్టికల్స్
- రూల్స్ పాటించని కాలేజీల గుర్తింపు రద్దయ్యే అవకాశం
Intermediate Practicals : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరంలోనూ ప్రాక్టికల్స్ పెట్టాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ విద్యా సంవత్సరం నుంచే అన్ని కాలేజీల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరంలోనూ ప్రాక్టికల్స్‌ను తప్పనిసరి చేస్తోంది. ఈ క్రమంలో వారానికి కనీసం రెండు రోజులు ల్యాబ్‌లోకి వెళ్లి ప్రయోగాలు చేయాల్సిందే. ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీల్లో ల్యాబ్ ప్రయోగాలు చేయించకుండా కేవలం థియరీ పాఠాలతోనే నెట్టుకొస్తున్నారనే ఫిర్యాదుల నేఫథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రతివారం ప్రయోగ పరీక్షలు తప్పనిసరి చేయాలనే నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రయోగ పరీక్షల అంశాలను వెల్లడించిన బోర్డు.. మరో 15 రోజుల్లో ప్రాక్టికల్స్‌కు సంబంధించిన విధివిధానాలతో మాన్యువల్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.
రాష్ట్రంలోని 3,339 ఇంటర్ కాలేజీల్లో సుమారు 10లక్షల మంది విద్యార్థులు చదువుతుండగా.. అందులో దాదాపు ఏడు లక్షల మంది సైన్స్ గ్రూపుల్లోనే ఉన్నారు. సైన్స్ విద్యార్థులకు వారానికి ఏడు పీరియడ్లు ఉంటే.. అందులో ఒక పీరియడ్ ను ప్రాక్టికల్స్‌కు కేటాయిస్తున్నారు. కానీ, ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు ఈ రూల్స్ పాటించకుండా ఆ సమయాన్ని కూడా థియరీ క్లాసులకే కేటాయిస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. కొన్ని కాలేజీలు కేవలం సెకండియర్ చివరిలో మాత్రమే విద్యార్థులతో ప్రాక్టికల్స్ చేయిస్తున్నాయి. దీంతో ఈ ఏడాది నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం నుంచే ప్రాక్టికల్స్ ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఎంపీసీ 60 మార్కుల్లో సగం, బైపీసీ 120 మార్కుల్లో 60 మొదటి సంవత్సరంకు కేటాయించారు. ఈసారి గణితానికి కూడా అంతర్గత మార్కులు ఉంటాయని ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది.
థియరీ క్లాసులో నేర్చుకున్న అంశాలను అదేవారంలో ల్యాబ్ లో ప్రయోగం చేసి చూసేలా కొత్త షెడ్యూల్ ను విద్యాశాఖ రూపొందిస్తోంది. సెక్షన్లు, విద్యార్థుల సంఖ్యను బట్టి వారానికి రెండు లేదా అంతకంటే ఎక్కువ రోజులు ల్యాబ్ సెషన్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థుల్లో బట్టీ విధానంతో పాఠ్యాంశంపై అవగాహన రావడం లేదని, స్వయంగా ప్రయోగాలు చేయడం వల్ల సబ్జెక్టుపై లోతైన పట్టు పెరుగుతుందని పలువురు విద్యావేత్తలు పేర్కొంటున్నారు. ఈ విధానం కేవలం ఇంటర్ మార్కులకే కాకుండా జాతీయ స్థాయి పోటీ పరీక్షలైన నీట్, జేఈఈలో మెరుగైన ర్యాంకులు సాధించేందుకు దోహదపడనుందని భావిస్తున్నారు.
మరోవైపు.. ప్రభుత్వం తాజా నిబంధనల ప్రకారం.. ప్రతి ఇంటర్ కాలేజీలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ తదితర ల్యాబ్‌లు ఉండాలి. ఇకపై ల్యాబ్ సదుపాయం లేని కాలేజీలపై కఠినంగా వ్యవహరించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. నిబంధనలు పాటించని కాలేజీల గుర్తింపును రద్దు చేసేలా ఇంటర్మీడియట్ బోర్డు సిద్ధమవుతోన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. కాలేజీలు బోర్డు నిబంధనలు పాటిస్తున్నాయా..? లేదా అనే విషయాలు తెలుసుకునేందుకు రాష్ట్రంలోని అన్ని ఇంటర్ కాలేజీల సీసీ కెమెరాలను ఇప్పటికే ఇంటర్ బోర్డు కమాండ్ కంట్రోల్ సెంటర్ తో లింక్ చేశారు. వీటి ద్వారా నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ప్రాక్టికల్స్ జరుగుతున్నాయా.. విద్యార్థులు ల్యాబ్ లో ప్రయోగాలు చేస్తున్నారా..? అనే విషయాలను అధికారులు లైవ్ లో మానిటర్ చేయనున్నారు.
