Telangana: శాసన మండలిలో బీఆర్ఎస్ రచ్చరచ్చ.. చైర్మన్ పోడియం చుట్టుముట్టి నినాదాలు.. మంత్రులు ఫైర్
Telangana : తెలంగాణ శాసనమండలిలో బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. మండలి చైర్మన్ పోడియంను చుట్టుమట్టి.. పెద్దెత్తున నినాదాలు చేశారు.

Telangana Legislative Council
Telangana: తెలంగాణ శాసనమండలిలో బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. మండలి చైర్మన్ పోడియంను చుట్టుమట్టి.. పెద్దెత్తున నినాదాలు చేశారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక చింపేసి నిరసన తెలిపారు. రాహుల్‌కు సీబీఐ వద్దు.. రేవంత్‌కు ముద్దు అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు.
Also Read : Kaleshwaram Project : తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. సీబీఐకి కాళేశ్వరం ప్రాజెక్టు కేసు
సోమవారం రెండోరోజు తెలంగాణ శాసన మండలి సమావేశం జరిగింది. శాసనసభలో ఆమోదం పొందిన బిల్లులకు మండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. తెలంగాణ పురపాలక సంఘ సవరణ ఆర్డినెన్సు, పంచాయతీ రాజ్ ఆర్డినెన్సు , అల్లో పతిక్ వైద్య సంరక్షణ చట్ట రద్దు బిల్లులను మండలిలో మంత్రులు ప్రవేశపెట్టారు. బిల్లులతోపాటు మరికొన్ని అంశాలను మండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే, శాసన మండలిలో బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు.
మండలిలో కాళేశ్వరం కమిషన్ నివేదికను పెట్టాలని బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు. మండలిలో చైర్మన్ పోడియంను చుట్టుముట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. కాళేశ్వరం కమిషన్ నివేదిక కాగితాలను చించి చైర్మన్ పైకి విసిరేశారు. కాళేశ్వరం విచారణను సీబీఐకి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. దీంతో మండలిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీల ఆందోళనల మధ్యనే బిల్లులను మంత్రి సీతక్క మండలిలో ప్రవేశపెట్టారు.
బడే బాయ్ చోటే బాయ్ ఏక్ హై.. కాలేశ్వరం రిపోర్టు ఫేక్ హై అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నినాదాలు చేశారు. కాంగ్రెస్, బీజేపీ దోస్తీ అని, రాహుల్‌కి సీబీఐ వద్దు, రేవంత్‌కి సీబీఐ ముద్దు అంటూ నినాదాలు చేశారు. బీఆర్ఎస్ సభ్యుల తీరుపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం కమిషన్ పై సీబీఐ విచారణను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు..? విచారణ ఎదుర్కొంటామన్న బీఆర్ఎస్ ఇప్పుడెందుకు భయపడుతుంది..? అంటూ పొన్నం ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లకు బీఆర్ఎస్ వ్యతిరేకమని స్పష్టమైందని పొన్నం ఆగ్రహం అన్నారు.
సభలో ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ సభ్యులపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన మధ్యే బిల్లులకు శాసనమండలి ఆమోదం తెలిపింది. చర్చ లేకుండానే పంచాయతీ చట్ట సవరణ బిల్లుకు శాసన మండలి ఆమోదం తెలిపింది. అనంతరం మండలి నిరవధిక వాయిదా పడింది.