Rajiv Yuva Vikasam Scheme : యువత భవిష్యత్తు కోసమే ‘రాజీవ్ యువ వికాస’ పథకం.. మీరూ అప్లయ్ చేశారా? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..!
Rajiv Yuva Vikasam Scheme : ప్రస్తుతానికి రాజీవ్ యువ వికాస పథకానికి ఎలాంటి నిధుల సమస్య లేదన్నారు. జూన్ 2 నుంచి స్వయం ఉపాధి పథకాల మంజూరి పత్రాలు అందజేస్తామన్నారు.

Telangana Rajiv Yuva Vikasam Scheme
Rajiv Yuva Vikasam Scheme : తెలంగాణ యువత జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకే రాజీవ్ యువ వికాస పథకాన్ని తీసుకొచ్చామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాజీవ్ యువ వికాస పథకం అమలుపై ఆయన ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ పథకం విజయవంతం చేసేందుకు అధికారులు అంకితభావంతో, పవిత్ర యజ్ఞంలా పనిచేయాలని సూచించారు. ప్రస్తుతానికి రాజీవ్ యువ వికాస పథకానికి ఎలాంటి నిధుల సమస్య లేదన్నారు. జూన్ 2 నుంచి స్వయం ఉపాధి పథకాల మంజూరి పత్రాలు అందజేస్తామన్నారు.
మధ్య దళారీల పైరవీలను ఎక్కడికి అక్కడ కట్టడి చేయాలని అధికారులకు డిప్యూటీ సీఎం సూచించారు. ఈ సమీక్ష సమావేశానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని యువత కోసమే రాజీవ్ యువ వికాసం స్కీమ్ తీసుకొచ్చింది. స్వయం ఉపాధి పథకం కింద అర్హులు అయిన బీసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
రాష్ట్రంలోని 5 లక్షల మంది యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఈ స్కీమ్ ప్రవేశపెట్టింది. అర్హులైన యువతకు రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఆర్థిక సాయం అందనుంది. ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి మార్చి 17న ప్రారంభించగా, అర్హులైన యువకులు ఏప్రిల్ 5వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పథకానికి ఎంపికైన యువకులు 60 శాతం నుంచి 80 శాతం వరకు సబ్సిడీని పొందవచ్చు. మొత్తం 160కి పైగా సెక్షన్లు ఉన్నాయి. ట్రాన్స్ పోర్ట్, అగ్రోస్, ఇండస్ట్రీస్, అగ్రికల్చర్ వంటి కేటగిరీలో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హతలను బట్టి యూనిట్లను ఎంచుకోవాలి.
యూనిట్‌పై ఎంత వరకు రాయితీ వస్తుందో కూడా తెలుసుకోవచ్చు. ఈ స్కీమ్ దరఖాస్తు చేసుకునే ముందు ఆధార్‌కార్డులో వివరాల ప్రకారం.. దరఖాస్తుదారుడి పేరు, ఫుడ్ సేఫ్టీ కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలి. అంతేకాదు.. పాన్ కార్డు, పాస్‌పోర్టు సైజు ఫోటో, లబ్ధిదారుడి ఫోన్ నంబర్ కూడా తప్పక ఇవ్వాలి.
- ముందుగా అధికారిక పోర్టల్ (https://tgobmms.cgg.gov.in) విజిట్ చేయాలి.
- రాజీవ్ యువ వికాసం పథకం అప్లికేషన్ లింక్ క్లిక్ చేయాలి.
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి సంబంధించి ఆప్షన్లు కనిపిస్తాయి. ఏదైనా ఆప్షన్ ఎంచుకోవాలి.
- కొత్త పేజీలో మీ వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేయాలి.
- యూనిట్ల వివరాలకు సంబంధించి లింక్ ఉంటుంది.
- ఆ లింక్ క్లిక్ చేస్తే చాలు.. యూనిట్లు వివరాలను పొందవచ్చు.