Driving License Test: డ్రైవింగ్ లైసెన్స్ పరీక్ష ఇకనుంచి కఠినతరం.. ‘సిమ్యులేటర్’ టెస్ట్ పాస్ అవ్వాల్సిందే..

డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు నిర్వహించే టెస్టులో కీలక మార్పులు చేసేందుకు రవాణాశాఖ సిద్ధమవుతోంది.

Driving License Test: డ్రైవింగ్ లైసెన్స్ పరీక్ష ఇకనుంచి కఠినతరం.. ‘సిమ్యులేటర్’ టెస్ట్ పాస్ అవ్వాల్సిందే..

Driving Simulator

Updated On : May 3, 2025 / 2:12 PM IST

Driving License Test: డ్రైవింగ్ లైసెన్స్ పరీక్ష పాస్ అవ్వాలంటే.. ఖాళీ మైదానంలోని ‘హెచ్’ ఆకారంలో, ‘ఎస్’ ఆకారంలో, ‘8’ ఆకారంలో ఉన్న ట్రాక్ లలో బండి నడిపితే ప్రస్తుతం సరిపోతుంది. కొంతమంది వాహనాన్ని సరిగా రివర్స్ తీయకపోయినా దళారుల సాయంతో టెస్టు పాస్ అవుతున్నారు. దీంతో లైసెన్స్ వచ్చిన తరువాత వచ్చీరాని డ్రైవింగ్ తో బైక్ లు, కార్లు నడుపుతూ పలు ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఈ క్రమంలో ప్రతీయేటా రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. ఎక్కువ రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం సరైన డ్రైవింగ్ రాకపోవటం వల్లనేనని రవాణాశాఖ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో డ్రైవింగ్ లైసెన్సు పొందేందుకు నిర్వహించే పరీక్షలో కీలక మార్పులు చేయబోతున్నారు.

 

డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు నిర్వహించే టెస్టులో కీలక మార్పులు చేసేందుకు రవాణాశాఖ సిద్ధమవుతోంది. కొత్త విధానంలో ట్రాక్ తో పాటు డ్రైవింగ్ నైపుణ్యాన్ని ప్రత్యేక పరికరంపై శాస్త్రీయంగా పరీక్షించనున్నారు. ఇందుకోసం సిమ్యులేటర్ ను ఉపయోగించనున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలను రవాణాశాఖ సూత్రప్రాయంగా ఆమోదించినట్లు సమాచారం. దీంతో రాష్ట్రంలో 61 ఆర్టీఓ కార్యాలయాలు ఉండగా.. 18ఆర్డీఓ కార్యాలయాల్లో 34 సిమ్యులేటర్లను ఏర్పాటు చేయాలని రవాణాశాఖ ప్రతిపాదించింది. సిమ్యులేటర్లను ప్రైవేట్ సంస్థల ద్వారా ఏర్పాటు చేయించాలని భావిస్తోంది. నూతన విధానంలో మైదానంలో టెస్ట్ ట్రాక్ తో పాటు దానికి ముందు సిమ్యూలేటర్ పై డ్రైవింగ్ పరీక్ష నిర్వహిస్తారని సమాచారం.

 

సిమ్యూలేటర్ నిజమైన కారుకు ప్రతిరూపం లాంటిది. దీంట్లో కారులో మాదిరిగా స్టీరింగ్, క్లచ్, బ్రేక్ గేర్లు అన్నీ ఉంటాయి. మీ ఎదురుగా స్క్రీన్ లో సాఫ్ట్ వేర్ ఉంటుంది. తెరపై రవాదారి, వాహనాలు ఉంటాయి. సిమ్యులేటర్ పై మీరు తిప్పే స్టీరింగ్, గేర్లను బట్టి వాహనం ముందుకు వెళ్తుంటుంది. పక్క నుంచి ఇతర వాహనాలు వెళ్తుంటాయి. తెరలో రోడ్డుపై బాగా వర్షం కురుస్తుంటుంది. లేదంటే.. పొగమంచు ఉంటుంది. అప్పుడు మీరు ఎలా డ్రైవింగ్ చేస్తారో విశ్లేషిస్తారు. డ్రైవింగ్ పరీక్షకు హాజరయ్యే వ్యక్తుల ముఖ కవళికలు కెమెరాల్లో రికార్డు అవుతాయి. అంతేకాదు.. మీరు ఆ సమయంలో ఒత్తిడికి గురవుతున్నారా.. ఎలా స్పందిస్తున్నారు అనేది విశ్లేషిస్తారు. దీని తరువాత ట్రాక్ టెస్టులు కూడా ఉంటాయి.

 

రాబోయే కొద్దిరోజుల్లోనే ఈ కొత్త విధానాన్ని అమలు చేసేందుకు రవాణాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీంతో నామమాత్రపు డ్రైవింగ్ స్కిల్స్ తో డ్రైవింగ్ లైసెన్సు పొందాలనుకునే వారికి ఈ కొత్త విధానం పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంది. అయితే, ఈ విధానం ద్వారా నాణ్యమైన డ్రైవింగ్ స్కిల్స్ ఉన్నవారికే డ్రైవింగ్ లైసెన్స్ అందుతుందని, తద్వారా రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.