Indira Eegalapati..Saudi Metro train : సౌదీ అరేబియాలో మెట్రోరైలు నడుపుతున్న తెలుగు మహిళ.. హైదరాబాద్ మెట్రో To రియాద్ మెట్రో వరకు ‘ఆమె‘ ప్రస్థానం

సౌదీ అరేబియాలో మెట్రోరైలు నడుపుతున్న తెలుగు మహిళ.. హైదరాబాద్ మెట్రో To రియాద్ మెట్రో రైలు వరకు తెలుగు మహిళ ప్రస్థానం ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుసుకుందాం.

Indira Eegalapati..Saudi Metro train : సౌదీ అరేబియాలో మెట్రోరైలు నడుపుతున్న తెలుగు మహిళ.. హైదరాబాద్ మెట్రో To రియాద్ మెట్రో వరకు ‘ఆమె‘ ప్రస్థానం

Indira Eegalapati Drives Saudi Metro train (1)

Indira Eegalapati drives Saudi Metro train  : సౌదీ అరేబియా. భూతల స్వర్గం. మహిళల ముఖాలకు ముసుగులు వేయటమే కాదు వారి ఆశలకు,ఆకాంక్షలకు కూడా ముసుగులు వేసే దేశం. మహిళల కనీస స్వేచ్ఛకు కూడా సంకెళ్లు వేసే దేశం. కానీ గత కొంతకాలంగా పాలకులు ఆంక్షలను సడలిస్తు మహిళలకు కొత్త రెక్కలు తొడుగుతున్నారు. ఒకప్పుడు వాహనాలు నడపటానికి మహిళలకు అనుమతి ఉండేది కాదు. కానీ ఈ నిషేధాలకు సౌదీ యువరాజు చెక్ పెట్టారు. దీంతో మహిళలు వాహనాలు నడిపే అవకాశం కలిగింది.

సౌదీ అరేబియాలో విజన్ 2030లో భాగంగా మహిళలు ఇప్పుడు మహిళా సాధికారతతో ముందుకెళుతున్నారు. వాహనాలే కాదు, మహిళలు కూడా ఇప్పుడు సౌదీ అరేబియాలో రైళ్లను కూడా నడుపుతున్నారు. ఇక్కడ మరో విషయం కూడా చెప్పుకోవాలని ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ప్రతిభ చాటుతున్న భారతీయ మహిళలు సౌదీ అరేబియాలో కూడా తమ సత్తా చాటుతున్నారు. సౌదీ అరేబియాలో హైదరాబాద్ కు చెందిన ఓ మహిళ లోకో పైలట్ గా పనిచేస్తున్నారు. ఆమే ఇందిరా ఈగలపాటి. సౌదీ అరేబియాలో మెట్రో రైలు నడుపుతున్నారు తెలుగు మహిళ ఇందిర.

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇందిర హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఆమె ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా పేరు తెచ్చుకున్నారు. సౌదీలో మెట్రో రైలు నడుపుతున్నారు ఇందిర. రియాద్ మెట్రో రైలులో పైలట్‌గా పనిచేస్తున్నారు. సౌదీ అరేబియాలో రైళ్లు నడపడానికి ముందు..ఇందిర హైదరాబాద్ మెట్రో రైల్‌లో మూడేళ్లు పనిచేశారు. ఐటి ఇంజనీరింగ్ పోస్ట్-గ్రాడ్యుయేట్ అయిన ఇందిర ఇప్పటివరకు 15,000 కిలోమీటర్లకుపైగా రైలు నడిపారు. ఐటీ రంగంలో ఈజీగా రాణించే ప్రతిభ ఉన్నా ఆమె మాత్రం తన స్నేహితుల కంటే విభిన్నంగా ఆలోచించారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ జాబు కంటే రైలు నడపటమే ఇష్టంగా చేసుకున్నారు. ఆమె స్నేహితులు సాఫ్ట్‌వేర్ రంగంలో స్థిరపడినా ఆమె మాత్రం వారికి భిన్నంగా లోకో పైలెట్ అయ్యారు. అలా ఆమె ప్రతిభ సౌదీ అరేబియాలో కూడా కనబరుస్తోంది. విదేశాలలో లోకో పైలట్‌లుగా పనిచేసిన అరుదైన మహిళల్లో ఇందిరా ఒకరిగా పేరు తెచ్చుకున్నారు.

తన రైలు ప్రయాణం గురించి ఇందిర ఎన్నో విషయాలు వెల్లడించారు. నా చిన్నతనంలో నేను మెకానిక్ గా ఉన్న మా నాన్నకు పనిముట్లు అందిస్తూ సహాయం చేసేదాన్ని. అలా నేను నా అభిరుచులకు అనుగుణంగా లోకో పైలెట్ అయ్యానని తెలిపారు. నేను ప్రపంచంలోని అత్యంత అధునాతన రైళ్లలో ఒకదాన్ని నడుపుతున్నానని తెలిపారు. మేము ముగ్గురం ఆడపిల్లలమే అయినా మా నాన్న మమ్మల్ని చదివించారు. కానీ మా బంధువులు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయాలి..కానీ వారిని చదివిస్తూ డబ్బులు ఇలా వృధా చేస్తున్నావు..ఆడపిల్లలు ఎంత చదివినా పెళ్లి చేయాల్సిందే కదా..అని చెప్పినా మానాన్న మాత్రం మమ్మల్ని చదివించి విద్యావంతుల్ని చేశారని ఈరోజున నేను అధునాతన రైళ్లు నడపగలుగుతున్నాను అంటే మానాన్న గొప్పతనమేనని తెలిపారు ఇందిర.

నేను రియాద్ మెట్రోకు ఎంపికైనప్పుడు.. మా బంధువుల్లో చాలా మంది ఒంటరి మహిళ రైలు పైలట్‌గా పనిచేయడానికి సౌదీ అరేబియాకు ఎలా పంపిస్తారు? అంటున్నా మానాన్న ఏమాత్రం భయపడలేదు. భయపడితే అనుకున్నది సాధించలేం అంటూ ప్రోత్సహించారని గుర్తు చేసుకున్నారు ఇందిర. నా పట్టుదల చూసి మానాన్న ప్రోత్సహించారు..అలా నేను దేశం దాటి సౌదీకి చేరుకున్నానని తెలిపారు ఇందిర.

ఫుట్‌బాల్ ప్రపంచకప్ సమయంలో సౌదీ అరేబియా అక్కడికి పంపిన తర్వాత ఇందిర కూడా రైలును దోహాలో నడిపారు. విజన్ 2030లో భాగంగా సౌదీ అరేబియాలో మహిళా సాధికారతతో ఆమె తన సౌదీ మహిళా సహోద్యోగులను ప్రశంసించింది. సౌదీ మహిళా పైలట్‌లు.. మెట్రో రైలు పైలట్‌లలో ప్రధాన భాగం అని పేర్కొంది. ఇందిర సౌదీ వెళ్లేనాటికి వివాహం కాలేదు. కానీ ఇప్పుడు ఆమె వివాహిత.ఆమె భర్త కూడా ఖతార్‌లో లోకో పైలట్‌గా పనిచేస్తున్నారు. అలా భార్యాభర్తలిద్దరు రైళ్లు నడిపేస్తున్నారు.