BJP: కమలం పార్టీకి ‘కేటీఆర్ టెన్షన్’ పట్టుకుందా?
ఒకవేళ కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతివ్వకపోతే పార్టీపై ప్రజల్లోకి తప్పుడు అభిప్రాయాలు వెళ్లే అవకాశం ఉందని.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ ఎఫెక్ట్ పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారట కమలం నేతలు.

BRS Working President KTR
కుమ్మక్కు రాజకీయాలు. ఇప్పడిది తెలంగాణ పాలిటిక్స్‌లో ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని బీజేపీ పార్టీ ఆరోపిస్తుంటే.. బీఆర్ఎస్-బీజేపీ ఒక్కటేనని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇదే సమయంలో కేంద్రంలో తిట్టుకుంటూనే..రాష్ట్రంలో కాంగ్రెస్-బీజేపీ దోస్తీ చేస్తున్నాయని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.
సరిగ్గా ఇదే టైమ్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అవినీతి ఆరోపణలు రావడం, ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్‌ను అరెస్ట్ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దమవడం ఉత్కంఠ రేపుతోంది. ఈ కార్ రేస్‌లో కేటీఆర్‌ను విచారించేందుకు గవర్నర్ అనుమతి కోరుతూ తెలంగాణ ఏసీబీ గవర్నర్‌కు లేఖ రాసింది. ప్రభుత్వం అనుమతి కోరి నెలరోజులు కావస్తున్నా గవర్నర్ ఇప్పటికీ నిర్ణయమూ తీసుకోలేదు. ఇదే ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ట్రయాంగిల్ ఫైట్‌కు కారణమవుతోంది.
బీజేపీకి ఆందోళన?
కేటీఆర్‌ను విచారించే విషయంలో గవర్నర్ నిర్ణయం ఆలస్యం అవుతుండటంతో బీజేపీ కొంత ఆందోళన చెందుతోందని తెలుస్తోంది. బీజేపీ-బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం కమలం పార్టీని టెన్షన్ పెడుతోందట. కేటీఆర్ విచారణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అటార్నీ జనరల్ అభిప్రాయం కోసం పంపించారని సమాచారం.
ఇదే సమయంలో కేటీఆర్ బీజేపీ అధిష్టానంతో కుమ్మక్కై తనపై విచారణ జరక్కుండా మేనేజ్ చేసుకున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కేటీఆర్ ఢిల్లీ వెళ్లి కేంద్రప్రభుత్వ పెద్దలతో రహస్యంగా మాట్లాడి, గవర్నర్ అనుమతి ఇవ్వకుండా మాట్లాడుకున్నారని మంత్రులు, కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాకుండా గవర్నర్ కూడా కేటీఆర్ ఢిల్లీ వెళ్లిన సమయంలోనే హస్తినకు వెళ్లడం, ఆ తర్వాత కేటీఆర్‌పై విచారణకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో కాంగ్రెస్ నేతలు విమర్శల దాడి ఇంకా పెంచుతున్నారు.
విమర్శలు ఎక్కువయ్యే అవకాశం
ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ నేతల్లో ఆందోళన నెలకొందట. కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి ఆలస్యమయ్యే కొద్ది బీజేపీ-బీఆర్ఎస్ ఒక్కటేనన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయన్న టెన్షన్ పట్టుకుందట. ఇంకా లేటైతే కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్లు బీఆర్ఎస్‌తో కుమ్మక్కయ్యామన్న విమర్శలు ఎక్కువయ్యే అవకాశం ఉందని మధన పడుతున్నారట. కేటీఆర్ విచారణ విషయంలో గవర్నర్ ఏ నిర్ణయం తీసుకున్నా తాము సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏంటని తలలు పట్టుకుంటున్నారట బీజేపీ లీడర్లు.
ఒకవేళ కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతివ్వకపోతే పార్టీపై ప్రజల్లోకి తప్పుడు అభిప్రాయాలు వెళ్లే అవకాశం ఉందని..రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ ఎఫెక్ట్ పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారట కమలం నేతలు. అందుకే కేటీఆర్ విచారణపై గవర్నర్ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారని కాంగ్రెస్ ప్రభుత్వం కంటే బీజేపీ నేతలే ఎక్కువగా ఎదురుచూస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఈ కార్ రేస్‌లో కేటీఆర్‌ను విచారించే అంశంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారన్నది బీజేపీలోనే కాదు..అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ వర్గాల్లోనూ ఉత్కంఠ రేపుతోంది. అంతలోపే ఒకరిని ఒకరు బ్లేమ్ చేసుకుంటున్నాయి మూడు పార్టీలు.
KCR: కాళేశ్వరంపై మళ్లీ విచారణ.. కేసీఆర్‌కు పిలుపు వస్తుందా? ముందు కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తారా?