Tension in Dandakaranyam వేడెక్కిన తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం
తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం వేడెక్కింది. ప్రతీకార జ్వాలలతో రగులుతోంది.. నిన్నటివరకూ ప్రశాంతంగా ఉన్న అడవిలో .. ఇప్పుడు అలజడి మొదలైంది.

Tension In Telangana Chhattisgarh Dandakaranyam
Tension in Dandakaranyam : తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం వేడెక్కింది. ప్రతీకార జ్వాలలతో రగులుతోంది.. నిన్నటివరకూ ప్రశాంతంగా ఉన్న అడవిలో .. ఇప్పుడు అలజడి మొదలైంది. 24 మంది జవాన్ల నెత్తుటివేడి చల్లారకముందే.. బూట్ల చప్పుళ్లు.. తుపాకుల మోతలకు చెక్ పెట్టేందుకు .. నిఘా వర్గాలు రంగంలోకి దిగాయి. నక్సల్స్ త్రిముఖ వ్యూహాలను తిప్పికొట్టి లెక్క తేల్చుకునేందుకు.. పోలీసులు అడవిపై కన్నేశారు. ఏజెన్సీలోని గోదావరి తీరం వెంట తనిఖీలు పెంచారు. నక్సల్స్ తీరం దాటకుండా.. చీమచిటుక్కుమన్నా తెలిసేలా .. డేగ కళ్లతో పహారా కాస్తున్నారు.
ములుగు, భూపాలపల్లి జిల్లాల్లోని గోదావరి తీరం ఆవలి వైపున .. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలో దండకారణ్యంతో నిండిన ప్రాంతాలున్నాయి. ఏ క్షణంలోనైనా మావోయిస్టులు తీరం దాటి ఇవతలికి వచ్చే అవకాశాలున్నాయని .. పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ నక్సల్స్‌కు అవకాశం ఇవ్వకుండా అప్రమత్తమయ్యారు. డ్రోన్ కెమెరాలతో నిఘా ముమ్మరం చేశారు. గోదావరి నదిపైనున్న అంతర్‌రాష్ట్ర వంతెనల వద్ద .. పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. వెంకటాపురం వాజేడు మండలాల్లోని పెర్రీ పాయింట్లలో .. నిఘా ఏర్పాటు చేశారు. వెంకటాపురం -చర్ల వాజేడు -వెంకటాపురం రహదారి వద్ద రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు వాహనాలను సోదా చేస్తున్నారు. వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్నారు.
వెంకటాపురం మండలంలో పలు గ్రామాలు అడవికి అతి చేరువలో ఉండడంతో .. ఏదిరా, ఆలుబాకా, తిప్పాపురం, సీతారాంపురం, ముత్తారం, పెంకవాగు, విజయపురి కాలనీ గ్రామాలకు .. గోదావరి దాటేందుకు అనువుగా ఉండడంతో .. తప్పించుకోవడం, లేదంటే తల దాచుకుంటారనే అనుమానంతో ఈ గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచారు. అటు గొత్తికోయగూడేలపై పోలీసులు ప్రత్యేక నజర్ పెట్టారు. మావోయిస్టులు తీరం దాటితే గొత్తికోయగూడేల్లోనే తలదాచుకునే అవకాశాలున్నాయి. దీంతో ఆయా గూడేల్లో గ్రామాలను దిగ్బంధిస్తున్నారు. అనుమానితులను ప్రశ్నిస్తూ అవసరమైన సమాచారాన్ని సేకరిస్తున్నారు.
మావోయిస్టుల నుంచి ముప్పు పొంచి ఉందనే సంకేతాలతో .. ప్రజాప్రతినిధులతో పాటు అధికారులను అప్రమత్తం చేశారు..పోలీసులు. మారుమూల ప్రాంతాల పర్యటనలపై ఆంక్షలు విధించారు. ఎస్పీ సంగ్రామ్‌సింగ్ జి.పాటిల్, ఏటూరునాగారం ఏఎస్పీ గౌష్ ఆలం ఆదేశాలతో .. సరిహద్దుల్లో నిఘాను కట్టుదిట్టం చేశామని చెప్పారు.. సీ.ఐ శివప్రసాద్. అత్యవసరమైనా ముందస్తుగానే పోలీసులకు సమాచారం ఇచ్చి .. పర్యటనలు చేపట్టేలా ఆదేశాలు ఇచ్చామన్నారు.